Ayyanna Patrudu: నాకు కూడా ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయి: అయ్యన్న పాత్రుడు
- టీడీపీకి దూరం జరుగుతున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్
- వాసుపల్లిని చంద్రబాబు ఎంతో గౌరవించారన్న అయ్యన్న
- చంద్రబాబు చాలాసార్లు వాసుపల్లి మాటలే విన్నారని వెల్లడి
టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలకు అడ్డుకట్ట పడడంలేదు. టీడీపీ నుంచి ఒక్కొక్కరే నిష్క్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ (దక్షిణం) టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ తన ఇద్దరు కుమారులతో వెళ్లి సీఎం జగన్ ను కలవడంతో వలసల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. గతంలో తనకు కూడా ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయని వెల్లడించారు. రాజకీయ విలువలే ముఖ్యమని భావించి తాను పార్టీ మారలేదని వివరించారు.
రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ పార్టీ విడిచి వెళ్లారని ఆరోపించారు. వాసుపల్లిని పార్టీలో ఎంతో గౌరవించారని, పార్టీ అధినేత చంద్రబాబు చాలాసార్లు వాసుపల్లి మాటలే విన్నారని తెలిపారు. కానీ ఇవాళ చంద్రబాబుకు కనీస మర్యాద ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు.
వైసీపీలోకి వెళ్లిన వాళ్లందరూ పనిలేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నారని అన్నారు. రాబోయే కాలం టీడీపీదేనని, పోయేకాలం వైసీపీదని అయ్యన్న స్పష్టం చేశారు. ప్రధాని కాళ్లు మొక్కినా సరే సీఎం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.
యుద్ధం మొదలయ్యాక వెనుదిగిరి చూడకూడదని, భయపడి పారిపోయే స్వభావం తమకు లేదని అయ్యన్న స్పష్టం చేశారు. టీడీపీ ఒక రాజకీయ యూనివర్సిటీ వంటిదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వెళ్లిన వ్యక్తేనని గుర్తించాలని, ఇప్పుడు తెలంగాణ కేబినెట్ లో ఉన్న సగం మంది టీడీపీ నుంచి వెళ్లినవారేనని వివరించారు.