Andhra Pradesh: రేపటి నుంచి ఏపీలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు
- సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకోబోతున్న పాఠశాలలు
- తొలి రోజు ఉపాధ్యాయులందరూ హాజరు కావాల్సిందే
- 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అనుమతి నిల్
సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి విద్యాసంస్థలు తెరుచుకోబోతున్నాయి. కంటెయిన్‌మెంట్ జోన్లకు బయట ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలి రోజు ఉపాధ్యాయులు అందరూ విధులకు హాజరు కావాల్సి ఉంటుందని, ఆ తర్వాతి రోజు (22) నుంచి ఆన్‌లైన్ టీచింగ్, టెలి కౌన్సెలింగ్, విద్యా వారధి వంటి కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు హాజరైతే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది.
1 నుంచి 8వ తరగతి విద్యార్థులను పాఠశాలలకు అనుమతించరు. అయితే, 9 నుంచి ఇంటర్ చదివే వారు మాత్రం తల్లిదండ్రుల అనుమతితో సందేహాలు నివృత్తి చేసుకునేందుకు వెళ్లొచ్చు. రెసిడెన్షియల్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా బోధిస్తారు. అవసరం అనుకుంటే పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయుల సూచనలు తీసుకోవచ్చు. విద్యావారధి, విద్యామృతం వంటి కార్యక్రమాలు వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.