IPL 2020: ఐపీఎల్‌లో బోణీ కొట్టిన సీఎస్‌కే.. అదరగొట్టిన రాయుడు

CSK wins over Mumbi in IPL first match
  • అర్ద సెంచరీతో ఆకట్టుకున్న రాయుడు, డుప్లెసిస్
  • మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరుకున్న సీఎస్‌కే
  • సీఎస్‌కే బ్యాటింగ్ ముందు తేలిపోయిన ముంబై బౌలర్లు
ఐపీఎల్ క్రీడా సమరాంగణం ప్రారంభమైంది. అబూధాబీలోని షేక్ జాయేద్ స్టేడియంలో జరిగిన ప్రారంభ పోరులో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అలవోక విజయం సాధించింది. తెలుగు కుర్రాడు అంబటి రాయుడు అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. అతడికి డూప్లెసిస్ అండగా నిలవడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (12) తీవ్రంగా నిరాశపరచగా, డికాక్ (33), సౌరభ్ తివారీ (42) పరవాలేదనిపించారు. ఇన్నింగ్స్‌ను ముంబై తొలుత దూకుడుగా ప్రారంభించినప్పటికీ దానిని చివరి వరకు కొనసాగించలేకపోయింది.

క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ పట్టుకోల్పోయింది. దీంతో చెన్నై బౌలర్లు పట్టు బిగించడంతో బ్యాట్స్‌మెన్‌కు పరుగులు సాధించడం కష్టమైంది. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీసుకోగా, చాహర్, జడేజాలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శామ్ కరన్, చావ్లాలు చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 163 పరుగుల ఓ మాదిరి విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై..6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఓపెనర్లు మురళీ విజయ్ (1), షేన్ వాట్సన్(4)లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్, అంబటి రాయుడు కలిసి క్రీజులో పాతుకుపోయారు. అడపాదడపా బంతులను బౌండరీలకు పంపిస్తూ విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. డుప్లెసిస్ 44 బంతుల్లో 6 ఫోర్లతో అజేయంగా 58 పరుగులు చేయగా, రాయుడు 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు.

వీరి దూకుడు ముందు ముంబై బౌలర్లు చిన్నబోయారు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఆ తర్వాత చెన్నై మరో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. 19.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి ఐపీఎల్‌లో బోణీ చేసింది.

ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, పాటిన్‌సన్, బుమ్రా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్‌లు చెరో వికెట్ పడగొట్టారు. సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించిన రాయుడుకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నేడు ఢిల్లీ కేపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య దుబాయ్‌లో రెండో మ్యాచ్ జరగనుంది.
IPL 2020
Mumbai Indians
Chennai super kings
Abudhabi

More Telugu News