Kangana Ranaut: 8 రకాల టెర్రరిస్టుల నుంచి ఇండస్ట్రీని కాపాడుకోవాలి: కంగనా రనౌత్
- దేశాన్ని ఏకం చేయగల శక్తి సినిమాలకు ఉంది
- సినీ పరిశ్రమను ఒకే తాటిపైకి తీసుకురావాలి
- అప్పుడు ప్రపంచంలోనే మన ఇండస్ట్రీ టాప్ లో ఉంటుంది
భారతీయ సినీపరిశ్రమ ఎన్నో ముక్కలుగా ఉందని... అవన్నీ ఒకే గొడుగు కిందకు రావాల్సిన అవసరం ఉందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. ఇండియాలో బాలీవుడ్ ను టాలీవుడ్ దాటిపోయిందని చెప్పారు. ప్రస్తుతం సినీ పరిశ్రమను ఎనిమిది రకాల టెర్రరిస్టులు పట్టి పీడిస్తున్నారని... వారి నుంచి పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నెపోటిజం టెర్రరిజం, డ్రగ్ మాఫియా టెర్రరిజం, సెక్సిజం టెర్రరిజం, మతపరమైన మరియు ప్రాంతీయ టెర్రరిజం, విదేశీ సినిమాల టెర్రరిజం, పైరసీ టెర్రరిజం, లేబర్ ను దోపిడీ చేసే టెర్రరిజం, ట్యాలెంట్ ను దోపిడీ చేసే టెర్రరిజం సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్నాయని అన్నారు.
దేశాన్ని ఏకం చేయగల శక్తి సినిమాలకు ఉందని కంగన తెలిపారు. సొంత ఐడెంటిటీలతో ఎవరికి వారే అన్నట్టుగా ఉన్న పలు సినీ పరిశ్రమలను ఒకే చోటకు చేర్చాలని ప్రధానమంత్రిని కోరుతున్నానని... అఖండ భారత్ మాదిరి సినీ పరిశ్రమను కూడా తయారు చేయాలని అన్నారు. అప్పుడు ప్రపంచంలోనే భారతీయ సినీ పరిశ్రమ అగ్రస్థానంలో వెలుగొందుతుందని చెప్పారు.