Telangana: మంత్రి ఈటల పేషీలోని ఇద్దరు డ్రైవర్లు, పీఏలు సహా ఏడుగురికి కరోనా
- మంత్రి, ఇతర సిబ్బందికి నెగటివ్
- నిన్న కార్యాలయానికి రాని మంత్రి
- ప్రైవేటు ఆసుపత్రులలో పెరుగుతున్న ఐసీయూ, వెంటిలేటర్ పడకల సంఖ్య
తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషీలోని ఏడుగురు సిబ్బంది కరోనా బారినపడ్డారు. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మన్లు ఉన్నారు. దీంతో మంత్రితోపాటు ఆయన పేషీలోని మిగతా సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకున్నారు. మంత్రి సహా అందరికీ నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న మంత్రి తన పేషీకి రాలేదని, ఇంట్లోనే ఉండి సందర్శకులను కలిశారని అధికారులు తెలిపారు.
కాగా, తెలంగాణలో కరోనాకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసీయూ, వెంటిలేటర్ల పడకల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఈ నెల 14 నాటికి మొత్తం 1,222 పడకలు అందుబాటులో ఉండగా, గత బుధవారం నాటికి 1,177 మాత్రమే అందుబాటులో ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది. అంటే మొత్తం 45 పడకలు తగ్గించారు. అదే సమయంలో కార్పొరేట్ ఆసుపత్రులలో వెంటిలేటర్, ఐసీయూ పడకల సంఖ్య పెరగడం గమనార్హం. ఈ నెల 14 నాటికి 2,129 అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాటికి మరో 121 తోడయ్యాయి. ఫలితంగా వాటి సంఖ్య 2,250కి పెరిగింది.