Ambati Rambabu: ప్రతిదానికి అడ్డుపడతాం, ఏ పనీ ముందుకు సాగనివ్వం అంటే ఎలా?: న్యాయవ్యవస్థలపై అంబటి వ్యాఖ్యలు
- హైకోర్టు నిర్ణయాలతో వైసీపీ నేతల్లో అసహనం
- న్యాయ వ్యవస్థల నిర్ణయాలపై వ్యతిరేకత వస్తోందన్న అంబటి
- న్యాయ వ్యవస్థల్లోనూ తప్పులు జరుగుతుంటాయని వెల్లడి
న్యాయ వ్యవస్థలు ప్రగతి నిరోధకాలుగా తయారవుతున్న భావన నానాటికీ బలపడుతోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ భావన ప్రజల్లో ప్రబలితే ప్రమాదకరం అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోందని ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు.
ప్రతి విషయంలో ప్రభుత్వానికి అడ్డం పడతాం, ఏ పనీ ముందుకు సాగనివ్వం అనే ధోరణి ఎక్కడో ఉందన్న సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి ధోరణులు గొడ్డలి పెట్టు అని అభివర్ణించారు. న్యాయవ్యవస్థలో కూడా తప్పులు జరుగుతుంటాయని, జిల్లా కోర్టులో ఒకరికి ఉరి శిక్ష వేస్తే దాన్ని హైకోర్టు రద్దు చేస్తుందని, దానిపై సుప్రీం కోర్టుకు వెళితే జిల్లా కోర్టు తీర్పునే సమర్థించే పరిస్థితులు ఉంటాయని అంబటి వివరించారు. ఏదేమైనా దిగువ కోర్టు ఇచ్చిందే తుది తీర్పు కాదని, పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.
అంతేగాకుండా, ఇటీవల ఏపీ హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉదహరించారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాలకు లేదనే కోణంలో హైకోర్టు పేర్కొందని చెప్పారు.
"గత ప్రభుత్వం విఫలమైతేనే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గత ప్రభుత్వం విధానాలను ఇదే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? మా విధానాలు వేరుగా ఉంటాయి, మా హామీలు, వాటిపై మేం నడుచుకునే పద్ధతులు వేరుగా ఉంటాయి. అంతేతప్ప గత ప్రభుత్వ విధానాలనే అనుసరించాలన్న మూసలోనే వెళ్లాలంటే సాధ్యపడే పనికాదు. ఆ విధంగా నూతనంగా ఏర్పడిన శాసనసభ నిర్ణయించుకునే విషయాల్లోనూ చొరబడడం సమంజసం కాదు, న్యాయబద్ధమైనది కాదు అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ దేశంలో ప్రజలదే నిర్ణయాధికారం. ప్రజల నిర్ణయం కారణంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతున్నాయి. తాజా పరిణామాలపై ప్రజలే నిర్ణయించుకోవాలి" అంటూ అంబటి పేర్కొన్నారు.