Devineni Uma: విశాఖ భూ కొనుగోళ్లపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా?: దేవినేని ఉమ
- రాజధాని అంశంపై ఉమ ట్వీట్
- ప్రమాణస్వీకారం మరునాడే చంద్రబాబు ప్రకటన చేసినట్టు వెల్లడి
- అంతకుముందే మీడియాలో కథనాలు వచ్చాయని వివరణ
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. నాడు ప్రమాణస్వీకారం చేసిన మరునాడే విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని అని చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. ఆ విస్పష్ట ప్రకటనకు రెండు నెలల ముందే మీ సొంత మీడియాలో రాజధానిపై కథనం వచ్చిందని, ఇతర పత్రికల్లోనూ వివరాలు వచ్చాయని వెల్లడించారు.
రాజధాని గురించి పత్రికల్లో ముందే వచ్చిన తరుణంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఎక్కడ అని ప్రశ్నించారు. కానీ, ఈ 15 నెలల్లో విశాఖలో జరిగిన భూ కొనుగోళ్లపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. అంతేకాదు, గతంలో రాజధాని ప్రకటనకు ముందు మీడియాలో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్ ను కూడా ఉమ ట్విట్టర్ లో పంచుకున్నారు.
అమరావతి భూముల విషయంలో భారీ స్థాయిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, బినామీల పేరుతో టీడీపీ నేతలు పెద్దఎత్తున భూముల కొనుగోళ్లు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, విశాఖలో వైసీపీ నాయకులు భూ దందాలు చేస్తున్నారంటూ టీడీపీ ప్రత్యారోపణలు చేస్తుండడం తెలిసిందే.