america: రూ. 58 వేల కోట్ల ఆస్తిని గుప్తదానం చేసిన అమెరికా పారిశ్రామికవేత్త!

Chuck Feeney Officially Given Away All His Money
  • తన భార్య కోసం మాత్రం 20 లక్షల డాలర్లు పెట్టుకున్న ఫీనీ
  • ఫ్రీనీ తమకు దారి చూపించారన్న బిల్ గేట్స్
  • మధ్యతరగతి వ్యక్తిలా విశ్రాంత జీవితం గడుపుతున్న వైనం
అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ‘డ్యూటీ ఫ్రీ షాపర్స్’ సహ వ్యవస్థాపకుడు చార్లెస్ చక్ ఫీనీ (89) తనకున్న యావదాస్తిని రహస్యంగా దానం చేసేశారు. ఆస్తి మొత్తం విలువ 58 వేల కోట్ల రూపాయలు. దాతృత్వంలో ఆనందాన్ని వెతుక్కున్న ఆయన తన ఆస్తి మొత్తాన్ని ‘అట్లాంటిక్‌ ఫిలాంత్రోపీస్‌’ ద్వారా దానం చేయనున్నట్టు 2012లోనే ప్రకటించారు.

ప్రపంచంలోని పలు ఫౌండేషన్లు, విశ్వవిద్యాలయాలకు తన ఆస్తిని దానంగా ఇచ్చేశారు. ఇంత చేసినా ఆయన ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఇటీవల ఈ విషయం బయటకు రావడంతో ప్రపంచం మొత్తం అవాక్కయింది. తన భార్య కోసం మాత్రం 20 లక్షల డాలర్లు ఉంచుకున్నారు.

దానంగా ఇచ్చిన దానిలో దాదాపు సగ భాగాన్ని విద్య కోసమే అందించారు. మిగతా దానిని మానవ హక్కులు, సామాజిక మార్పులు, ఆరోగ్య సమస్యలు వంటి అంశాల్లో తోడ్పడేందుకు ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్రీనీ మాట్లాడుతూ.. తన జీవితంలో చాలా నేర్చుకున్నానని, తాను బతికి ఉండగానే ఈ మంచి కార్యక్రమం పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఫీనీ దానం గురించి తెలిసిన బిల్ గేట్స్ మాట్లాడుతూ.. తమ సంపాదన మొత్తాన్ని దానం చేసేందుకు చక్ తమకు ఓ దారి చూపించాడని, ఆస్తిలో సగం కాదు, మొత్తం దానం చేయాలంటూ తమలో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. కాగా, 58 వేల కోట్ల ఆస్తిని దానం చేసిన చక్ ఇప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ మామూలు ఆపార్ట్‌మెంట్‌లో భార్యతో కలిసి ఓ మధ్యతరగతి వ్యక్తిలా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు.
america
Business man
Chuck Feeney
Philanthropy
Bill Gates

More Telugu News