Balli Durga Prasad: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిపై రాష్ట్రపతి, ప్రధాని వ్యాఖ్యలు
- గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన బల్లి దుర్గాప్రసాద్
- కరోనాకు చెన్నైలో చికిత్స పొందుతుండగా ఘటన
- రాజకీయ వర్గాల్లో కలకలం
తిరుపతి ఎంపీ, వైసీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ ఈ సాయంత్రం గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. నెలరోజుల కిందట కరోనా చికిత్స కోసం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే ఈ సాయంత్రం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారం వెలిబుచ్చారు.
తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మరణవార్తతో కదిలిపోయానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.
దుర్గాప్రసాద్ అనేక ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు: వెంకయ్యనాయుడు
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. దుర్గాప్రసాద్ ఇక లేరన్న వార్తతో తీవ్ర విచారానికి గురయ్యానని తెలిపారు. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. 28 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన దుర్గాప్రసాద్ అనేక ప్రజా ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారని తెలిపారు. పార్లమెంటేరియన్ గా, నాలుగు సార్లు గూడూరు శాసనసభ్యునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని వెల్లడించారు.
ఎంతో ప్రభావవంతమైన సేవలు అందించారు: ప్రధాని నరేంద్ర మోదీ
లోక్ సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మృతి ఎంతో విషాదం కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడైన రాజకీయ నేత అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసం ప్రభావవంతమైన సేవలు అందించారని కీర్తించారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి, మిత్రులకు, హితులకు సంతాపం తెలుపుకుంటున్నాని ట్వీట్ చేశారు.