India: రెండు వారాల క్రితం.. సరిహద్దుల్లో గాల్లోకి 200 రౌండ్ల కాల్పులు జరిపిన భారత్‌-చైనా సైనికులు!

India China Fired 100 200 Warning Shots

  • తూర్పు లడఖ్‌ సమీపంలో ఘటన
  • పాంగాంగ్‌లో రెండు వారాల క్రితం హెచ్చరిక కాల్పులు
  • ఇటీవల కీలక పర్వత ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్న భారత్
  • పాంగాంగ్‌ టీఎస్‌ఓ వద్ద కీలక పరిణామాలు

తూర్పు లడఖ్‌ సమీపంలో భారత్‌-చైనా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఘటనకు సంబంధించిన విషయాలు మీడియాకు తెలిశాయి. పాంగాంగ్‌లో రెండు వారాల క్రితం భారత్‌-చైనా మధ్య దాదాపు 100-200 పరస్పర హెచ్చరిక కాల్పులు జరిగినట్లు తెలిసింది.

ఇటీవల పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో భారత్‌ కీలక పర్వత ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్‌పై చైనా దాడికి దిగాలంటే అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన లేహ్‌లోని పాంగాంగ్‌ టీఎస్‌ఓ వద్ద చాలా కీలక పరిణామాలు చోటుచేసుకొన్నట్లు తెలిసింది. సరస్సు దక్షిణ ప్రాంతంలో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించడంతో చైనా దళాలు ఉత్తర భాగంలో దురుసుగా వ్యవహరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే చుషూల్‌ సబ్‌ సెక్టార్‌లో హెచ్చరికలు చేస్తూ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని ఓ ఉన్నతాధికారి తెలిపారని ఓ జాతీయ మీడియ  కథనాన్ని ప్రచురించింది. భారత్‌-చైనా దళాలు పాంగాంగ్‌ సరస్సు ఉత్తరం వైపున ఉన్న ఫింగర్స్‌ వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఫింగర్‌ 3 నుంచి ఫింగర్‌ 4 మధ్య  కీలకమైన శిఖరాలను స్వాధీనం చేసుకొనే క్రమంలో ఇరు వర్గాలు 100-200 రౌండ్ల మేరకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు ఆ అధికారి చెప్పారు. ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే, సెప్టెంబర్‌ 7న చుషూల్‌ సబ్‌సెక్టార్‌ వద్ద గాల్లోకి కాల్పులు జరిగాయని మాత్రం ఇరు దేశాలు ప్రకటనలు చేశాయి. భారత దళాల స్పందనకు ప్రతి స్పందనగానే తాము కాల్పులు జరిపినట్లు చైనా చెప్పుకొచ్చింది.

ఇటీవలే రష్యాలో చైనా, భారత్‌ మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఆ భేటీకి ముందే ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. చర్చల నేపథ్యంలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలనే కుట్రతో ఇటువంటి చర్యలకు పాల్పడే అలవాటు చైనాకు ఉంది. ఆ తర్వాత రష్యాలో ఇరుదేశాల సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన విడుదలైంది.

దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. కాగా, తూర్పు లడఖ్‌లోని హిమాలయాల సమీపంలో సరిహద్దుల వద్ద చైనా సైనికులు శరవేగంగా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ నెట్‌వర్క్‌ను వేస్తున్నారు. తనకు అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన లేహ్‌లోని పాంగాంగ్‌ టీఎస్‌ఓ వద్ద చైనా ఈ చర్యలకు పాల్పడుతోంది. దీంతో ఇప్పటికే భారత్‌ అప్రమత్తమైంది.

  • Loading...

More Telugu News