Kapil Mishra: విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ ను ఉరి తీయడం ఖాయం: కపిల్ మిశ్రా సంచలన వ్యాఖ్య
- ఢిల్లీ అల్లర్లు, ముంబై ఉగ్రదాడులు ఒకటే
- ఢిల్లీ వాసులు న్యాయం కోసం చూస్తున్నారు
- వీడియో విడుదల చేసిన కపిల్ మిశ్రా
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం పూర్వపు నేత, ఢిల్లీ అల్లర్లలో ప్రమేయం సహా, దేశద్రోహం అభియోగాలపై అరెస్ట్ అయిన ఉమర్ ఖలీద్ ను ఉరి తీయడం ఖాయమని బీజేపీ నేత కపిల్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమర్ ను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులను అభినందించిన ఆయన, ఓ వీడియో మెసేజ్ ని విడుదల చేశారు. తాహిర్ హుస్సేన్, ఉమర్ ఖలీద్ వంటి వారిని ఉరి తీయడం ఖాయమని తాను భావిస్తున్నట్టు ఈ వీడియోలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్లు, ముంబైపై జరిగిన ఉగ్రదాడితో సమానమని ఆయన అభివర్ణించడం గమనార్హం.
ఇది ఉగ్రవాదులు ఓ పథకం ప్రకారం చేసిన కుట్ర తరువాత జరిగిన దాడులని, దీనికి ఉమర్, తాహిర్ తదితరులే కారణమని కపిల్ మిశ్రా ఆరోపించారు. ఎన్నో దుకాణాలను ధ్వంసం చేయడంతో పాటు, ప్రజలను చంపేందుకు వీరు చూశారని, ఈ నేరానికి జీవిత ఖైదు లేదా ఉరి ఖాయమని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ వాసులంతా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని, వారి ఆశ నెరవేరుతుందని అన్నారు.
కాగా, పౌరసత్వ చట్టాన్ని కేంద్రం ఆమోదించిన తరువాత, దీన్ని వ్యతిరేకిస్తూ, ఢిల్లీ కేంద్రంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు, గతంలోనే ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి, తాజాగా ఉమర్ ఖలీద్ ను అదుపులోకి తీసుకున్నారు.