Telangana: ప్రైవేటు యూనివర్శిటీల్లో రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఉండవు: తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- అసెంబ్లీలో ఆమోదం పొందిన ప్రైవేటు వర్శిటీల బిల్లు
- మల్లారెడ్డి సహా ఐదు వర్శిటీలకు అనుమతులు
- నాణ్యతా ప్రమాణాలు పెంచడానికేనన్న సబిత
తెలంగాణలో నూతనంగా ఏర్పాటు కానున్న ప్రైవేటు యూనివర్శిటీల్లో రిజర్వేషన్ల విధానం అమలు కాబోదని, ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఉండదని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. నిన్న ప్రైవేటు వర్శిటీల బిల్లును అసెంబ్లీ ఆమోదించిన నేపథ్యంలో ఆమె మాట్లాడారు. విద్యా ప్రమాణాలను పెంచడమే తమ లక్ష్యమని, అందుకోసం అనేక చర్యలను తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు.
ప్రైవేటు కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను మరింతగా పెంచేందుకు తీసుకుంటున్న చర్యలతో గతంలో ఉన్న 350 కాలేజీలు, ఇప్పుడు 180కి తగ్గాయని గుర్తు చేశారు. ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు 2018లోనే చట్టం తెచ్చామని, వర్శిటీలను ఏర్పాటు చేస్తామంటూ 16 సంస్థలు ముందుకు రాగా, తొలి దశలో ఐదు వర్శిటీలకు మాత్రమే అనుమతించామని అన్నారు. మహీంద్ర, హోస్టన్, మల్లారెడ్డి, అనురాగ్, ఎస్ఆర్ వర్శిటీలు ఏర్పడనున్నాయని, వీటిల్లో నూతన నిబంధనలు అమలవుతాయని తెలిపారు.
ఈ ప్రైవేటు వర్శిటీలను రెండు కేటగిరీలుగా విభజించామని మంత్రి చెప్పారు. ఇప్పటికే కాలేజీలు, విద్యార్థులు ఉన్న సంస్థలు బ్రౌన్ ఫీల్డ్ యూనివర్శిటీలుగా ఉంటాయని, కొత్తగా ఏర్పాటయ్యేవి గ్రీన్ ఫీల్డ్ వర్శిటీలని, ఈ వర్శిటీల్లో రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఉండబోవని అన్నారు. బ్రౌన్ ఫీల్డ్ వర్శిటీల్లో పాత సీట్లకు గత పద్ధతులే అమలవుతాయని ఆమె స్పష్టం చేశారు. కోర్టుల్లో విచారణ దశలో ఉన్న కేసుల కారణంగా నియామకాల్లో ఆలస్యమైందని, ఇప్పటికే వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటైందని అన్నారు. ప్రైవేటు వర్శిటీల కోసం ఏటా రూ. 700 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.