Suriya: హీరో సూర్యపై కోర్టు ధిక్కారణ చర్యలు చేపట్టండి: ప్రధాన న్యాయమూర్తికి మద్రాస్ హైకోర్టు జడ్జి లేఖ
- నీట్ పరీక్షల నేపథ్యంలో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
- పరీక్షలకు అనుమతించిన కోర్టులపై సూర్య విమర్శలు
- న్యాయ వ్యవస్థను కించపరిచారంటూ హైకోర్టు జడ్జి ఆగ్రహం
సినీ నటుడు సూర్యకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. నీట్ పరీక్షలు రాస్తున్న ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సూర్య చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడిన సూర్యపై కోర్టు ధిక్కారణ చర్యలను తీసుకోవాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం లేఖ రాశారు.
కరోనా సమయంలో నీట్ పరీక్షను నిర్వహించడంతో తీవ్ర ఒత్తిడికి గురైన ముగ్గురు తమిళ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సూర్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసులను విచారిస్తున్న న్యాయమూర్తులు... విద్యార్థులను మాత్రం భయం లేకుండా నీట్ పరీక్షలకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించాడు. ఇలాంటి పరీక్షల వల్ల విద్యార్థుల జీవితాలు బలికావడం మినహా మరెలాంటి ఉపయోగం లేదని అన్నాడు. పిల్లల మరణాలు తల్లిదండ్రులకు జీవితకాల శిక్షగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టులు, ప్రభుత్వాలు క్రూరంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించాడు. సూర్య చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ట్వీట్ పై జస్టిస్ సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని అన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. సూర్యపై కోర్టు ధిక్కారణ చర్యలను ప్రారంభించి, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని కోరారు.