East Godavari District: అంతర్వేది విధుల్లో ఉన్న ఎస్పీ, ఏఎస్పీలకు కరోనా
- ఎస్పీ అద్నాన్ నయీం, ఏఎస్పీ కరణం కుమార్‌లకు కరోనా
- మరో పదిమంది పోలీసులకు కూడా
- జిల్లాలో మొత్తం 850 మంది పోలీసులకు సోకిన మహమ్మారి
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో రథం దగ్ధం తర్వాత బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా వైరస్ సోకింది. వీరిలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అదనపు ఎస్పీ కరణం కుమార్, రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డితోపాటు పది మంది పోలీసులు మహమ్మారి బారినపడినట్టు ఎస్పీ తెలిపారు. పరీక్షల్లో తమకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 850 మంది పోలీసులు ఈ మహమ్మారి బారినపడినట్టు అధికారులు తెలిపారు.
ఆలయ రథం దగ్ధమైన తర్వాత అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రోజూ నిరసనలు జరుగుతుండడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.