Navid Afkari: ఇరాన్ రెజ్లింగ్ ఛాంపియన్ నవీద్ అఫ్కారీ ఉరితీత.. మూగబోయిన క్రీడా ప్రపంచం!
- సెక్యూరిటీ గార్డును చంపాడని ఆరోపణలు
- ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన సమయంలో ఘటన
- ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కేసు
ఇరాన్ ఛాంపియన్ రెజ్లర్ నవీద్ అఫ్కారీని ఈ ఉదయం ఉరితీశారు. 2018లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన సమయంలో ఓ సెక్యూరిటీ గార్డును కత్తితో పొడిచి చంపాడన్న ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు అతనికి ఉరిశిక్షను విధించింది. ఈ ఉదయం లీగల్ అంశాలను పూర్తి చేసిన తర్వాత అఫ్కారీని ఉరితీశారని స్థానిక మీడియా వెల్లడించింది.
మరోవైపు, ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించింది. చేయని తప్పును ఒప్పుకునేలా అఫ్కారీని టార్చర్ కు గురి చేశారంటూ అతని కుటుంబసభ్యులు, సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. అతను తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, అఫ్కారీని ఎవరూ టార్చర్ చేయలేదని వ్యాఖ్యానించింది.
మరోవైపు, 85 వేల మంది క్రీడాకారులతో కూడిన ఒక గ్లోబల్ యూనియన్ గురువారం నాడు స్పందిస్తూ, అఫ్కారీని ఉరితీస్తే క్రీడా ప్రపంచం నుంచి ఇరాన్ ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా అఫ్కారీని ఉరి తీయవద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమం నడిచింది. అయినా అఫ్కారీని ఉరితీయడంతో క్రీడా ప్రపంచం మూగబోయింది.