Khazana Jewellers: కరోనా నివారణ కోసం తెలంగాణ సర్కారుకు భారీ విరాళం ఇచ్చిన ఖజానా జ్యుయెలర్స్
- కేటీఆర్ కు రూ.3 కోట్ల విరాళం చెక్ ఇచ్చిన 'ఖజానా' కిషోర్ కుమార్
- వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వినియోగించాలని విజ్ఞప్తి
- కిషోర్ కుమార్ ను అభినందించిన మంత్రి కేటీఆర్
బంగారం, వెండి ఆభరణాల వ్యాపారంలో అగ్రశ్రేణి సంస్థగా పేరుగాంచిన ఖజానా జ్యుయెలర్స్ కరోనా నివారణ చర్యల కోసం తనవంతుగా భారీ విరాళం అందించింది. ఖజానా జ్యుయెలర్స్ అధినేత కిషోర్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కు రూ.3 కోట్ల మేర విరాళం తాలూకు చెక్ అందజేశారు. ఈ నిధిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా చికిత్స, కరోనా బాధితుల సంరక్షణ, వైరస్ నిర్మూలన కార్యక్రమాల కోసం వినియోగించాలని ఖజానా జ్యుయలర్స్ అధినేత కిషోర్ కుమార్ మంత్రి కేటీఆర్ ను కోరారు.
కిషోర్ కుమార్ దాతృత్వం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారమే వృత్తి అయినప్పటికీ, సామాజిక సేవా దృక్పథంతో కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారంటూ కొనియాడారు. కరోనా నివారణ చర్యల కోసం భారీ విరాళాన్ని అందజేయడం అభినందనీయమని అన్నారు.
కాగా, ఈ విరాళం ఇచ్చేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖజానా జ్యుయలర్స్ అధినేతను ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. కేటీఆర్ ను కిషోర్ కుమార్ కలిసిన సమయంలో ఎర్రబెల్లి కూడా వెంట ఉన్నారు. కిషోర్ కుమార్ మాట్లాడుతూ, వ్యాపారమే కాకుండా, ప్రజల శ్రేయస్సు కూడా ముఖ్యమేనని తలచి ఈ విరాళం ఇస్తున్నామని తెలిపారు.