Jagan: వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్.. మ‌హిళ‌ల ఖాతాల్లో రూ.6,792.20 కోట్లు జమ!

asara scheme launches in ap

  • మ‌హిళ‌ల‌తో మాట్లాడిన ఏపీ సీఎం
  • 8,71,302 పొదుపు సంఘాల్లో ల‌బ్ధిదారులు
  • 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో అప్పులు
  • రూ.27,168.83 కోట్లు నాలుగు విడతల్లో  జ‌మ  

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్  ఈ రోజు తన క్యాంపు కార్యాలయం నుంచి 'వైఎస్సార్‌ ఆసరా' పథకాన్ని ప్రారంభించారు. 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో  జ‌మ చేస్తుంది.

ఈ మేర‌కు తొలి విడతలో భాగంగా రూ.6,792.20 కోట్లను  జమ చేశారు. ఈ డ‌బ్బు మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని మ‌హిళ‌ల‌కే వదిలేస్తున్నామని ప్ర‌భుత్వం తెలిపింది. బ్యాంకర్లు ఆ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని ఆదేశించింది.

ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ... తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామ‌ని చెప్పారు. 87 లక్షల మంది మహిళలకు రూ.27వేల కోట్ల రుణాలున్నాయని గుర్తు చేశారు. అలాగే పీ అండ్ ‌జీ, హెచ్‌యూఎల్‌ లాంటి మల్టీనేషనల్‌ కంపెనీల ద్వారా మహిళలకు చేయూతనిస్తామ‌ని, పసిపిల్లల నుంచి బామ్మ‌ల వరకు అంద‌రికీ ప్ర‌యోజ‌నాలు చేకూరేలా తాము సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామ‌ని చెప్పారు.

అమ్మ ఒడి ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని ఆయ‌న తెలిపారు. ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామ‌ని అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.1800 కోట్ల బకాయిలను తాము చెల్లించామ‌ని తెలిపారు.

అలాగే, హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల కోసం తాము వసతి దీవెన అమలు చేస్తున్నామ‌ని చెప్పారు. కొంద‌రు కుట్రపూరితంగా ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. అయిన‌ప్ప‌టికీ తాము త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని భ‌రోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News