chanchalguda: చంచల్‌గూడ జైలుకు అదనపు కలెక్టర్ నగేశ్.. మరో ఆడియో టేప్ వెలుగులోకి..!

Medak Additional collector sent to Chanchalguda jail

  • రూ. 1.12 కోట్ల లంచం కేసులో అరెస్ట్
  • బాధితుడు లింగమూర్తితో మాట్లాడిన ఆడియో టేప్ వెలుగులోకి
  • పరిస్థితులు అర్ధం చేసుకోవాలని బతిమాలిన లింగమూర్తి

రూ. 1.12 కోట్ల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించడంతో నిన్న ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో సహ నిందితులైన నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, చిలప్‌చేడ్ తహసీల్దారు అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్, బినామీ జీవన్‌గౌడ్‌లను కూడా రిమాండ్‌కు తరలించారు.

వారికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా, లంచం డబ్బుల కోసం నగేశ్ పలు విడతలుగా బాధితుడు లింగమూర్తితో మాట్లాడిన ఆడియో క్లిప్పింగుల్లో మరికొన్ని గురువారం వెలుగులోకి వచ్చాయి. వాటి ప్రకారం..

మిగిలిన డబ్బులు ఇవ్వాలని అదనపు కలెక్టర్ నగేశ్ బాధితుడు లింగమూర్తిని కోరగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. దీనికి నగేశ్ స్పందిస్తూ మళ్లీ మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లింగమూర్తి స్పందిస్తూ 'సార్, ఇవి డబ్బులు, పైగా వైట్ కాదు' అన్నారు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలని, తాను తీసుకునేదే ఎకరా రూ. 15 లక్షలకని, 10 ఎకరాలకు రూ. 1.50 కోట్లు అవుతాయని పేర్కొన్నారు. తాను అబద్ధం చెప్పడం లేదని, తానైనా డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తారని నగేశ్‌కు చెప్పారు.

అవన్నీ తనకు అనవసరమని నగేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాష్ ఇవ్వడంలో ఇబ్బంది ఉండడంతోనే బినామీ జీవన్‌గౌడ్‌ను ఒప్పించి ఇక్కడకు తీసుకొచ్చానని, ఏ అధికారీ ల్యాండ్ తీసుకోడని, ముఖ్యంగా సమస్య ఉన్న స్థలంలో అస్సలు తీసుకోడని తేల్చి చెప్పారు. దానికి బదులుగా చిన్న ప్లాట్ తీసుకుంటామని అదనపు కలెక్టర్ నగేశ్ స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా వారి మధ్య సంభాషణ కొనసాగింది. జీవన్ గౌడ్‌కు సంబంధించిన వివరాలను లింగమూర్తికి వివరించారు.

  • Loading...

More Telugu News