Donald Trump: కరోనా మహమ్మారిపై కావాలనే అలా మాట్లాడాను: డొనాల్డ్ ట్రంప్

Only Intensional says Trump on His Comments on Corona Virus

  • ప్రజల్లో ఆందోళన పెరగకుండా చూడటమే నా విధి
  • సున్నితమైన అంశం కావడంతోనే జాగ్రత్తలు
  • అన్ని ఫ్లూలతో పోలిస్తే కరోనా ప్రాణాంతకమే
  • వాషింగ్టన్ క్రానికల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్

కరోనా వైరస్ తీవ్రతపై కావాలనే తగ్గించి మాట్లాడానని, ఈ మహమ్మారిపై ప్రజల్లో ఆందోళన పెరగరాదన్నదే తన అభిమతమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బాబ్ వుడ్ వార్డ్ తో స్వయంగా ట్రంప్ తెలిపారు. "కరోనా తీవ్రతను నేను ఎప్పుడూ తక్కువగానే చూపాను. ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే, ప్రజల్లో భయాందోళనలు పెరగడం నాకు ఇష్టం లేదు" అని వుడ్ వార్డ్ కు మార్చి 19న ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో ట్రంప్ 'వాషింగ్టన్ క్రానికల్'కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఫిబ్రవరి 7న ట్రంప్ మాట్లాడుతూ, "పీలుస్తున్న గాలిలోనే ప్రాణాంతక వైరస్ ఉందని ప్రచారం చేస్తే చాలా కష్టం. ఇది చాలా సున్నితమైన అంశం. ఇదే సమయంలో ఇప్పుడున్న అన్ని ఫ్లూలతో పోలిస్తే కొవిడ్ వైరస్ ప్రాణాంతకం" అని అన్నారు.

కాగా, ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముందు...అంటే జనవరి 30న ట్రంప్ మాట్లాడుతూ, మహమ్మారిని పూర్తి నియంత్రణలో ఉంచామని, ఇది చాలా చిన్న సమస్యేనని, అమెరికన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక ట్రంప్ ఇంటర్వ్యూలను వుడ్ వార్డ్ ఓ పుస్తకరూపంలో తీసుకురానుండగా, ఇది వచ్చే వారంలో విడుదల కానుంది.

ఈ మహమ్మారి ఎంత ప్రభావం చూపుతుందన్న విషయమై ట్రంప్ కు జనవరి 20నే అధికారులు స్పష్టంగా చెప్పారని ఈ బుక్ లో వుడ్ వార్డ్ ప్రస్తావించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ నుంచి హెచ్చరికలు వచ్చాయని, 1918లో ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రాణాలు హరించిన ఫ్లూ మహమ్మారి కన్నా ఇది ప్రమాదకరమైనదని స్పష్టం చేశారని పేర్కొన్నారు.

ఇక ఈ పుస్తకంలో పలు సంచలన అంశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. వాణిజ్య సలహాదారు పీటర్ నవార్రోపై విమర్శలు, డెమోక్రాట్లపై చేసిన వ్యాఖ్యలు, హేట్ స్పీచ్ పై అభిప్రాయాలు, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై చేసిన వ్యాఖ్యలు తదితరాలను కూడా పొందుపరిచారు.

  • Loading...

More Telugu News