Andhra Pradesh: చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీని మోసగించబోయి దొరికిపోయిన ఘరానా మోసగాడు!

Man arrested for Cheating MLA Vidadala Rajini

  • సచివాలయ ఉద్యోగినంటూ పరిచయం
  • కొవిడ్ నిధుల మంజూరీ పేరుతో టోకరా వేసే ప్రయత్నం
  • విశాఖలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీని రూ. 4 లక్షల మేర మోసగించాలని చూసిన ఓ ఘరానా మోసగాడిని గుంటూరు పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలో ఉంటున్న రజనీకి మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి ఫోన్ చేసి తనను తాను బాబూ జగ్జీవన్‌రావుగా పరిచయం చేసుకున్నాడు. సచివాలయంలో పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయల చొప్పున మంజూరయ్యాయని, ఒక్కొక్కరికీ రూ. 25 లక్షల చొప్పున రుణాల రూపంలో 8 మందికి కొవిడ్ నిధులు మంజూరు చేస్తారని చెప్పాడు.

ఒక్కో లబ్ధిదారుడు రూ. 50 వేల చొప్పున మొత్తం 4 లక్షల రూపాయలను ఆర్టీజీఎస్ ద్వారా అరగంటలో తన ఖాతాకు పంపాలని సూచించాడు. ఈ క్రమంలో సీఎం జగన్ పేరును పదేపదే ప్రస్తావించాడు. డబ్బులు చెల్లించకుంటే చిలకలూరిపేట నియోజకవర్గానికి కొవిడ్ నిధులు దక్కకుండా పోతాయన్నాడు.

నిందితుడి మాటలు నమ్మిన ఎమ్మెల్యే రూ. 4 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే, నిందితుడు పలుమార్లు జగన్ పేరును ప్రస్తావించడం, ఆయనే మీతో మాట్లాడమన్నారని చెప్పారని చెప్పడంతో ఎమ్మెల్యే రజనీకి అనుమానం వచ్చింది. దీంతో సీఎం కార్యాలయంలోని అధికారులను ఆరా తీయగా, జగ్జీవన్‌రావు పేరుతో ఎవరూ లేరని తేలింది. దీంతో ఆమె డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు.

డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి రంగంలోకి దిగారు. ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడు జగ్జీవన్‌రావు విశాఖలో ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలిసిన రజని తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పరవాడ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.

అనంతరం పట్టాభిపురం ఎస్సై సత్యనారాయణతోపాటు మరో ముగ్గురు పోలీసులు విశాఖ వెళ్లి పరవాడ పోలీసుల సాయంతో నిందితుడు బాబూ జగ్జీవన్‌రావును అరెస్ట్ చేసి గుంటూరు తరలిస్తున్నారు. నిందితుడిపై ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలాంటి కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News