Thieves: హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో దొంగల చేతివాటం!
- రోగుల విలువైన వస్తువులు మాయం
- పోలీసుల అదుపులో నలుగురు
- మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్న సూపరింటెండెంట్
హైదరాబాదులోని ప్రఖ్యాత గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా రోగులకు చెందిన విలువైన వస్తువులు గల్లంతవుతున్న సంఘటనలు అంతకంతకు పెరిగిపోతుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. నగలు, మొబైల్ ఫోన్లు కనిపించడంలేదంటూ ఆరుగురు కరోనా రోగులు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ఘటనలు జరుగుతున్నట్టు గుర్తించారు.
కాగా, నలుగురు అనుమానితులను ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. వారి వద్ద బంగారు నగలు ఉండగా, వాటిపై ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వలేదు. అయితే, ఆసుపత్రి లోపల పీపీఈ కిట్లు ధరించి అనేకమంది తిరుగుతుంటారని, వారిలో దొంగలు ఎవరో గుర్తించడం కష్టమవుతోందని ఓ భద్రతాధికారి వాపోయారు. దొంగలు కూడా పీపీఈ కిట్లు ధరించి వార్డుల్లో చొరబడుతున్నట్టు గుర్తించారు.
ఇకపై కరోనా రోగులతో ఆభరణాలకు అనుమతి ఇవ్వబోమని ఆసుపత్రి భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. విలువైన వస్తువులను రోగుల బంధువులు, సంబంధీకులకు గేటు వద్దే అప్పగిస్తామని వివరించాయి. ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు.