Anagani Sathyaprasad: సింగిల్ రన్ తీయడం చేతకాని వ్యక్తి సెంచరీ కొడతానని ప్రగల్భాలు పలికినట్టుంది: అనగాని సత్యప్రసాద్
- వైసీపీ నేతలపై అనగాని విసుర్లు
- పాలన చేతకాకపోతే ఇంట్లో గేములు ఆడుకోవాలని సూచన
- తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని హితవు
వైసీపీ సర్కారుపైనా, ఆ పార్టీ నేతలపైనా రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులకు పాలన చేతకాకపోతే ఇంట్లో కూర్చుని వీడియో గేములు ఆడుకోవాలని, అంతేతప్ప తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే సింగిల్ రన్ తీయడం చేతకాని వ్యక్తి సెంచరీ కొడతానని ప్రగల్భాలు పలికినట్టుగా ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు.
సీఎం జగన్ కు బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి ప్రాంతాల్లో మూడు చోట్ల మూడు ఇళ్లు ఉన్నాయని చెప్పి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారా ఏంటి?... లేకపోతే, వైసీపీ జెండాలో మూడు రంగులు ఉన్నాయని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అమరావతిపై దుష్ప్రచారం చేసేందుకే ఏడాదిన్నర సమయం వృథా చేశారని, మూడు రాజధానుల విషయంలో మిగిలిన మూడేళ్ల సమయం వృథా చేయడం తప్ప ఏమీ చేయలేరని ప్రజలకు కూడా తెలిసిపోయిందని పేర్కొన్నారు.
కోర్టులు గనుక అడ్డుకుని ఉండకపోతే వైసీపీ అనాలోచిత నిర్ణయాలకు రాష్ట్రం నిలువునా మునిగిపోయేదని విమర్శించారు. ఈ మేరకు టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.