Raghurama Krishnaraju: కొడాలి నాని పితృభాష ఎక్కువగా వినియోగిస్తున్నారు: రఘురామకృష్ణరాజు

Raghurama Krishnaraju criticizes Kodali Nani language

  • అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దన్న కొడాలి నాని
  • అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామకృష్ణరాజు
  • కొడాలి నాని మాటతీరుపై విమర్శలు

అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని, అక్కడి నుంచి తరలించాలంటూ ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే రాజధాని మొత్తాన్ని విశాఖకు తరలించాలని భావిస్తున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిగా రాజధాని తరలింపుపై గతంలోనే వార్తలు వచ్చినా, ఇవాళ కొడాలి నాని వ్యాఖ్యలతో మరింత బహిర్గతం అయిందని అన్నారు. కోర్టులో కేసులు వెనక్కి తీసుకోకుంటే ఈ చిన్న రాజధానిని కూడా తరలించేస్తామని కొడాలి నాని బెదిరిస్తున్నారని, మంత్రి పితృభాష ఎక్కువగా వాడుతున్నారని ఆరోపించారు. కోర్టులో ఉన్న ఓ అంశం గురించి మంత్రి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు.

"నాని గారు ఏది మాట్లాడినా వారి భావవ్యక్తీకరణలో ఉన్న మాధుర్యం చాలామందికి నచ్చుతుందనుకుంటా. ఆఖరికి సీఎం గానీ, చంద్రబాబు గానీ మాట్లాడినా లక్ష వ్యూస్ వస్తే, నాని గారికి మాస్ లో ఉన్న పాప్యులారిటీ దృష్యా ఆయనకు మిలియన్ వ్యూస్ వస్తాయి. ఆయన మాట్లాడే పితృభాష నచ్చేవారు ఎక్కువమంది ఉంటారు కాబట్టి ఆయన వాక్కు ఎక్కువమందికి చేరుతుందని భావిస్తున్నా" అంటూ రఘురామకృష్ణరాజు చురకంటించారు.

  • Loading...

More Telugu News