Media Point: అసెంబ్లీలో మీడియా పాయింట్ తొలగించడంపై భట్టి, సీఎం కేసీఆర్ మధ్య వాదోపవాదాలు
- నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- మీడియా పాయింట్ లేకపోవడంపై భట్టి ఆగ్రహం
- ఇది విపక్షాల గొంతు నొక్కడమేనని వ్యాఖ్యలు
- సభలో మాట్లాడేందుకు సమయం ఇస్తామన్న సీఎం
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి. అయితే అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ ఎత్తివేయడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ ఎత్తివేయడం అంటే విపక్షాల గొంతు నొక్కడమేనని అన్నారు.
సభలో ఎలాగూ మైక్ ఇవ్వరు, కనీసం మీడియా పాయింట్ అయినా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ, కరోనా వ్యాప్తి కారణంగానే మీడియా పాయింట్ తొలగించామని వెల్లడించారు. ఎన్నిరోజులైనా సభలో చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు. అయినా, సభ కంటే మీడియా పాయింట్ ఎక్కువైందా? అని అడిగారు.
అందుకు భట్టి బదులిస్తూ, ప్రతి సమావేశంలోనూ ఇవే మాటలు చెప్పి గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యానిస్తూ, సభ్యుల సంఖ్య ప్రకారం సభలో మాట్లాడేందుకు సమయం ఇస్తామని, దాని ప్రకారం తమ సమస్యలు సభలో వినిపించుకోవచ్చని వివరించారు.