HSTDV: హైపర్ సోనిక్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో
- వీలర్ ఐలాండ్ నుంచి హెచ్ఎస్ టీడీవీ ప్రయోగం
- శాస్త్రవేత్తలను అభినందించిన రాజ్ నాథ్
- దేశం గర్విస్తోందంటూ ట్వీట్
కేంద్ర రక్షణ రంగంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ పాత్ర ఎంతో కీలకం. ఇప్పటికే అనేక రక్షణ వ్యవస్థలను అందించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు కొంతకాలంగా హైపర్ సోనిక్ సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు సాగిస్తున్నారు.
ఈ క్రమంలో నేడు నిర్వహించిన హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ వెహికిల్ (హెచ్ఎస్ టీడీవీ) పరీక్ష విజయవంతమైంది. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఒడిశాలోని వీలర్ ఐలాండ్ లో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ వెహికిల్ ను విజయవంతంగా పరీక్షించారని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ కార్యాచరణను సాకారం చేసే విధంగా అద్భుతమైన ఆవిష్కరణ సాధించారంటూ కొనియాడారు. ఈ అద్భుతమైన టెక్నాలజీని అభివృద్ధి చేసిన డీఆర్డీవో శాస్త్రవేత్తలను చూసి భారతదేశం గర్విస్తోందంటూ ట్విట్టర్ లో స్పందించారు.