Telangana: మధ్యాహ్నం 3 గంటలకల్లా వీఆర్‌వోల వద్దనున్న రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశం
- వీఆర్‌వోల వద్దనున్న రెవెన్యూ రికార్డుల స్వాధీనం
- సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ?
- మధ్యాహ్నం 3 గంటలకల్లా ప్రక్రియ పూర్తి
- సాయంత్రం కల్లా రికార్డుల స్వాధీనంపై నివేదికలు
వీఆర్‌వో వ్యవస్థ రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వీఆర్‌వోల వద్దనున్న రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆయన చెప్పారు. అలాగే, సాయత్రం 5 గంటలలోపు.. రికార్డుల స్వాధీనంపై నివేదికలు ఇవ్వాలని తెలిపారు.
రెవెన్యూ శాఖలో అవినీతి భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఏసీబీ దాడుల్లో చిక్కుతున్న వారిలో వీఆర్వోలే అధికంగా ఉంటున్నారు. దీంతో ఆ వ్యవస్థకు స్వస్తి చెప్పాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన చేస్తున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించారు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తచట్టాన్ని ఈ సమావేశాల్లోనే ప్రకటిస్తారని సమాచారం. వీఆర్వోలను ఉద్యోగాల నుంచి తొలగించకుండా వేరే శాఖలో సర్దుబాటు చేయనున్నారు.
కాగా, దివంగత సీఎం ఎన్టీఆర్ హయాంలోనూ పటేల్, పట్వారీల వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలోనే వెళ్తూ కేసీఆర్ కూడా పలు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని నెలల క్రితమే గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు.
ఈ మేరకు సోమేశ్ కుమార్ అన్ని చర్యలూ తీసుకున్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా కొన్ని వారాల క్రితమే తెలిపారు. రైతులు భూములు సాగు చేసుకుంటున్నా వారి పేర్లు రికార్డుల్లోకి ఎక్కడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు రాక, ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు పొందలేక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. దీనికి వీఆర్‌వోలే కారణమని, ఆ వ్యవస్థను రద్దు చేస్తామని అన్నారు.