Kangana Ranat: వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించినందుకు.. అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపిన హీరోయిన్!
- కంగనాకు, శివసేన నేతలకు మధ్య వివాదం
- ముంబైలో అడుగుపెట్టొద్దని కంగనాకు వార్నింగ్
- 11 మందితో సెక్యూరిటీ కల్పించిన కేంద్రం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో శివసేన, కంగనాకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముంబైలో అడుగుపెట్టొందంటూ శివసేన నేతలు ఆమెకు వార్నింగ్ ఇచ్చారు కూడా. దీంతో, ముంబై పీఓకే మాదిరి తయారైందంటూ ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కంగన... ఈనెల 9న ముంబైకి రానుంది. దీంతో, ఆమెకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీ కింద ఆమెకు ఒక పర్సనల్ సెక్యూరిటీ అధికారితో పాటు మరో 10 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు. వీరిలో కమెండోలు కూడా ఉంటారు. తనకు భద్రతను కల్పించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కంగన ధన్యవాదాలు తెలిపారు. ఒక మహిళను ఆయన గౌరవించారని చెప్పారు. ఏదైనా సమస్య పట్ల నిర్భయంగా గొంతుకను వినిపిస్తున్న వ్యక్తిని ఏ శక్తీ ఆపలేదనే విషయం దీని వల్ల అర్థమవుతోందని అన్నారు.