MT New Diamond: 79 గంటల తర్వాత ఎంటీ న్యూ డైమండ్ ఆయిల్ ట్యాంకర్‌లోని మంటలు అదుపులోకి
- కువైట్ నుంచి 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్‌కు
- శ్రీలంక తూర్పు తీరంలో అగ్నిప్రమాదం
- మంటలను అదుపు చేసిన భారత్, శ్రీలంక నావికా దళాలు
కువైట్ నుంచి 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్ వస్తూ గురువారం అగ్నిప్రమాదానికి గురైన ఎంటీ న్యూడైమండ్ ఆయిల్ ట్యాంకర్‌లో ఎట్టకేలకు మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటన జరిగిన 79 గంటల తర్వాత మంటలను పూర్తిస్థాయిలో నిలువరించినట్టు శ్రీలంక నేవీ తెలిపింది.
శ్రీలంక తూర్పు తీరానికి సమీపంలో ప్రమాదం సంభవించడంతో శ్రీలంక, భారత నౌకాదళాలు వెంటనే స్పందించి రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. మంటల కారణంగా నౌకలోని ఇంజిన్ గదిలో ఉన్న బాయిలర్ పేలడంతో ఫిలిప్పీన్స్‌కు చెందిన నావికుడు మృతి చెందాడు. మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు సింగపూర్ నిపుణుల బృందం సాయాన్ని తీసుకున్నారు. ప్రమాదానికి గురైన ఓడ తిరిగి రవాణాకు పనికి వస్తుందా? లేదా? అన్న విషయాన్ని సింగపూర్ నిపుణుల బృందం పరిశీలించనుంది.