Ashu Jaat: ముంబయిలో పండ్ల విక్రేతగా మారిన కరుడుగట్టిన యూపీ గ్యాంగ్ స్టర్... అయినా వదలని పోలీసులు
- నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న యూపీ పోలీసులు
- ముంబయి పారిపోయిన 'మిర్చి' గ్యాంగ్ లీడర్
- ఫోన్ కాల్స్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు
ఇటీవల ఉత్తరప్రదేశ్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్లను ఎన్ కౌంటర్ చేయడమో లేక వారిని అరెస్ట్ చేయడమో చేస్తున్నారు. తాజాగా ఓ నేరస్థుడు ముంబయి పారిపోయి వేషం మార్చుకుని పండ్ల విక్రేతగా అవతారమెత్తినా, యూపీ పోలీసులు అతడ్ని వదల్లేదు. అతడి ఫోన్ కాల్స్ ఆధారంగా ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ లో మీరట్ కు చెందిన ఆషు జాట్ ఓ ఘరానా క్రిమినల్. అతడిపై 51 కేసులున్నాయి. 32 ఏళ్ల ఆషు జాట్ హత్యలు, కిడ్నాప్ లు, దోపిడీలు చేస్తూ భయాందోళనలకు గురిచేశాడు. అతడిపై రూ.2.5 లక్షల రివార్డు కూడా ఉంది. ఆషు జాట్ గ్యాంగ్ లో 25 మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్యాంగ్ ను 'మిర్చి గ్యాంగ్' అని పిలుస్తారు. కళ్లల్లో కారం కొట్టి దోపిడీలకు పాల్పడుతుండడంతో ఆ పేరొచ్చింది.
అయితే, ఓ హెల్త్ కేర్ కంపెనీ రీజినల్ మేనేజర్ హత్య కేసులో తనను యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారన్న భయంతో ఆషు జాట్ ముంబయి పారిపోయాడు. అక్కడ వేషం మార్చుకుని, పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ముంబయిలో ఉన్న విషయం పసిగట్టిన పోలీసులు వేటకు సిద్ధమయ్యారు.
కానీ ఆషు రూపురేఖలు బాగా మారిపోవడంతో పోలీసులకు అతడ్ని గుర్తించడం చాలా కష్టమైంది. చివరికి అతడు స్నేహితులకు ఫోన్ కాల్స్ చేస్తున్న విషయం గుర్తించి, ఆ దిశగా దర్యాప్తు జరిపారు. ఫోన్ కాల్స్ ను ట్రాక్ చేయడం ద్వారా ఆషు జాట్ ను గుర్తించి, ఆపై అరెస్ట్ చేయగలిగారు.