Uttar Pradesh: విషపూరిత పామును మింగేయబోయిన చిన్నారి.. నోట్లోంచి బయటకు తీసిన తల్లి
- ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోని ఘటన
- చిన్నారికి యాంటీ-వెమోన్ ఇంజక్షన్ ఇచ్చిన వైద్యులు
- ఐసీయూలో చికిత్స
- ప్రమాదం లేదన్న వైద్యులు
దేవేంద్ర అనే ఓ చిన్నారి (1) ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు.. అదే సమయంలో ఓ చిన్న పాము అక్కడకు వచ్చింది. అది ఏంటో కూడా తెలియని ఆ పిల్లాడు దాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుని మింగేయబోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన అతడి తల్లి పరుగున వచ్చి అతడి నోట్లోంచి ఆ పామును తీసేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
ఆ చిన్నారిని పాము కాటేయలేదు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోని భోలాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బాలుడి నోట్లోనుంచి పామును తీసేసిన తర్వాత తన భర్త ధర్మపాల్ తో కలిసి ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లింది.
అలాగే, ఆ పాముని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి దాన్ని వైద్యులకు చూపించి, దాన్నే తమ కుమారుడు మింగేయబోయాడని తెలిపారు. ఆ బాలుడికి వైద్యులు యాంటీ-వెమోన్ ఇంజక్షన్ ఇచ్చారు. అనంతరం అతడిని అత్యవసర చికిత్సా విభాగంలో చేర్చుకుని చికిత్స అందించారు.
తన కుమారుడి నోట్లో ఏదో ఉందని గుర్తించిన తన భార్య సోమవతి దాన్ని నోట్లోంచి బయటకు తీసిందని, అది పాము అని గుర్తించి భయంతో వణికిపోయిందని ధర్మపాల్ తెలిపాడు. ఆ పాము చనిపోయిందని వివరించాడు. ఆ పాము చాలా విషపూరితమైనదని, ఆ చిన్నారికి చికిత్స అందించామని, అతడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదమూలేదని వైద్యులు తెలిపారు.