Balineni Srinivasa Reddy: రైతులు బిల్లులు చెల్లించడం ద్వారా నాణ్యమైన కరెంట్ కోసం విద్యుత్ సిబ్బందిని ప్రశ్నించే వీలుంటుంది: బాలినేని
- రూపు మారుతున్న ఉచిత విద్యుత్ పథకం
- ఇకపై రైతులకు నేరుగా నగదు బదిలీ
- వివరణ ఇచ్చిన మంత్రి బాలినేని
ఉచిత్ విద్యుత్ పథకాన్ని కేంద్రం సంస్కరణలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న ఏపీ సర్కారు ఈ దిశగా రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా, ఈ అంశంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. రైతులపై రూపాయి కూడా భారం పడకుండా కరెంటు బిల్లులకు సంబంధించిన మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి ముందుగానే జమ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని వెల్లడించారు.
అన్నదాతలు తమ ఖాతాల్లోకి నగదు జమ అయిన తర్వాతే బిల్లు మొత్తాన్ని డిస్కంలకు చెల్లిస్తారని మంత్రి వివరణ ఇచ్చారు. రైతులు నేరుగా బిల్లులు చెల్లించడం ద్వారా నాణ్యమైన కరెంట్ సరఫరా కోసం విద్యుత్ శాఖ సిబ్బందిని ప్రశ్నించే వీలుంటుందని తెలిపారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ ను మరో 30 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా కొనసాగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బాలినేని ఉద్ఘాటించారు.