Dhawaleshwaram: మళ్లీ ఉగ్రరూపంలోకి గోదావరి, కృష్ణలో పెరిగిన వరద!

Once Again Flood in Godavari and Krishna

  • ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత, పెన్ గంగా
  • సముద్రంలోకి సుమారు 4 లక్షల క్యూసెక్కుల నీరు
  • భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న వరద

ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత, పెన్ గంగ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో, గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. లక్ష్మీ బ్యారేజ్ నుంచి 8.60 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు కిందకు వదులుతుండగా, భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో శబరి, తాలిపేరు, కిన్నెరసాని సైతం ఉప్పొంగుతుండగా, ధవళేశ్వరం వద్ద నిన్న సాయంత్రానికే 4 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. ఈ నీటిలో ఉభయ గోదావరి జిల్లా కాలువలకు 11,600 క్యూసెక్కులను పంపుతూ, మిగతా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

మరోవైపు కృష్ణా నదికి ప్రధాన ఉపనదుల్లో ఒకటైన భీమాపై మహారాష్ట్రలోని ఉజ్జయిని డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చింది వచ్చినట్టుగా విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్ లోని ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకూ అన్ని రిజర్వాయర్లూ నిండిపోవడంతో, కాలువలన్నింటికీ పూర్తి స్థాయిలో నీరు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి డెల్టా కాలువలకు 16 వేల క్యూసెక్కులు, సముద్రంలోకి 15 వేల క్యూసెక్కుల నీరు వెళుతోంది.

Dhawaleshwaram
Godavari
Krishna
Flood
  • Loading...

More Telugu News