WHO: నిరూపితం కాని వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్ఓ

WHO warns about amateur corona vaccines

  • హడావుడిగా సాగుతున్న వ్యాక్సిన్ పరిశోధనలు
  • ఇది సరైన ధోరణి కాదన్న డబ్ల్యూహెచ్ఓ
  • మూడో దశ క్లినికల్ ట్రయల్సే ప్రామాణికం అని స్పష్టీకరణ

కరోనా మహమ్మారిని పారదోలేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ల అభివృద్ధిపై ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధారణంగా ఏళ్లు పట్టే వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను అనేక దేశాలు కొన్నినెలల వ్యవధిలోనే ముగించేందుకు తహతహలాడుతున్నాయి. అయితే ఈ తరహా ధోరణులను ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుబట్టింది. నిరూపితం కాని వ్యాక్సిన్ లతో ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే అధికం అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.

హడావుడిగా వ్యాక్సిన్ ప్రయోగాలకు అనుమతులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు ఉన్నాయని, భవిష్యత్తులో ఇక క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉండదని, పూర్తిస్థాయి అధ్యయనానికి నోచుకోని వ్యాక్సిన్ పనితీరు కూడా అరకొరగానే ఉండొచ్చని స్పష్టం చేశారు. తద్వారా, ఈ వ్యాక్సిన్ వైరస్ ను పూర్తిగా నిర్మూలించకపోగా, ఆ వైరస్ పెరుగుదలకు దోహదపడుతుందని  హెచ్చరించారు. ఓ వ్యాక్సిన్ సమర్థమైనదన్న విషయం దాని మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ద్వారానే నిరూపిమతవుతుందని, ఇది ప్రపంచ ప్రామాణికం అని ఆమె వివరించారు. అమెరికాలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి త్వరలోనే అనుమతి మంజూరు చేస్తామని అమెరికా ఎఫ్ డీఏ పేర్కొన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ విధంగా స్పందించింది.

  • Loading...

More Telugu News