Pranab Mukherjee: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ పాత్ర, కృషి మరువలేనివి!
- నాడు రాష్ట్ర విభజనపై ఏర్పడిన కమిటీకి నాయకత్వం
- ఆపై రాష్ట్రపతిగా సంతకం
- ప్రణబ్ ను గుర్తు చేసుకున్న కేసీఆర్
ఎన్నో దశాబ్దాల సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే, అందులో ఎందరో వీరుల త్యాగాలతో పాటు పులువురు జాతీయ నాయకుల కృషి ఉండగా, వారిలో ఓ ముఖ్యమైన పేరు ప్రణబ్ ముఖర్జీ. తొలుత కేంద్ర మంత్రి హోదాలో, నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుపై నియమించిన కమిటీకి నాయకత్వం వహించిన ఆయన, ఆ తరువాత, రాష్ట్రపతి హోదాలో తెలంగాణ బిల్లుపై సంతకం కూడా పెట్టారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి, ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నవేళ, తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతుండగా, నాటి యూపీఏ ప్రభుత్వం, ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోనే ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ తెలంగాణ ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ, అందుకు విధి విధానాలను రూపొందించింది. ఆపై ఎన్నో కమిటీలు ఏపీని విభజించే నిమిత్తం పనిచేశాయి. ఆపై ప్రణబ్ ను రాష్ట్రపతి పదవి వరించింది.
వైఎస్ మరణం, ఆపై తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైన తరువాత ఏపీని విడగొట్టాలని నిర్ణయం తీసుకున్న యూపీఏ, చివరకు లోక్ సభ ముందుకు బిల్లు తెచ్చింది. ఎన్నో వివాదాల అనంతరం, పార్లమెంట్ ఉభయ సభలు తెలంగాణ రాష్ట్రం పుట్టుకకు కారణమైన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును ఆమోదించిన తరువాత అత్యంత కీలకమైన రాష్ట్రపతి సంతకాన్ని ప్రణబ్ ముఖర్జీ పెట్టారు. దాని తరువాతనే స్పెషల్ గెజిట్ ద్వారా రాష్ట్రం ఏర్పడినట్టు ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.
ఇక ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రణబ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలియజేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, నాడు రాష్ట్రపతి హోదాలో ఉన్న ప్రణబ్, శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన వేళ, ఘన స్వాగతం పలికిన కేసీఆర్, ఆయన పాదాలను తాకి అభివాదం చేసిన సంగతి తెలిసిందే.