Hyderabad: బైక్‌పై నెమ్మదిగా వెళ్లమన్నందుకు గొడవ.. కారులో ఉన్న వారిని చితకబాదిన యువకులు!

Clash between men at Tankbund

  • ట్యాంకుబండ్‌పై ఘటన
  • కారులో ఉన్న వారిని చితకబాదిన యువకులు
  • ఏం జరుగుతుందో తెలియక ట్యాంక్‌బండ్‌పై భక్తుల పరుగులు

బైక్‌పై అతివేగంతో దూసుకెళ్తున్న యువకులను నెమ్మదిగా వెళ్లమని చెప్పడమే వారి పాపమైంది. బైక్ ఆపిన యువకులు తమను హెచ్చరించిన వారిపై దాడిచేసి చితకబాదారు. ఈ క్రమంలో కారులో మంటలు అంటుకోవడంతో అవి పక్కనే ఉన్న బస్టాప్‌నకు కూడా అంటుకున్నాయి. హైదరాబాద్‌లోని ట్యాంకుబండ్‌పై జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పార్సీగుట్ట జెమిస్థాన్‌పూర్‌కు చెందిన అరుణ్ (27), సాయికుమార్ (28), సంతోష్ (22), మల్లికార్జున్(27) కలిసి వినాయకుడిని ప్రతిష్ఠించారు.

ఆదివారం రాత్రి టాటా సఫారీ వాహనంలో విగ్రహాన్ని తీసుకొచ్చి ట్యాంకుబండ్‌లో నిమజ్జనం చేసి తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో ట్యాంకుబండ్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద వెనక నుంచి బైక్‌పై ముగ్గురు యువకులు అతివేగంగా దూసుకెళ్లడం చూసిన అరుణ్ వారిని వారించాడు. అంతే, బైక్ ఆపిన ముగ్గురు యువకులు కారులో ఉన్న వారితో గొడవకు దిగారు. ఈలోపు ఆ యువకుల స్నేహితులు కూడా వచ్చి కారులో ఉన్న వారిపై దాడిచేశారు.

అదే సమయంలో కారులో ఒక్కసారిగా మంటలు అంటుకుని పక్కనే ఉన్న బస్టాప్‌నకు అంటుకోవడంతో అది కాలిబూడిదైంది. బాధితుడు అరుణ్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, కారులో మంటలు చెలరేగి బస్టాప్ దగ్ధం కావడంతో నిమజ్జనానికి వచ్చిన భక్తులు భయంతో పరుగులు తీశారు.

  • Loading...

More Telugu News