Rushikesh: రిషికేశ్ లో నగ్నంగా నిలబడి వీడియో తీసుకున్న ఫ్రాన్స్ యువతి... అరెస్ట్ చేసిన పోలీసులు!

Nude Video of France Lady in Rushikesh Goes Viral
  • పవిత్రమైన లక్ష్మణ్ జులాపై వీడియో
  • విమర్శలు రావడంతో క్షమాపణలు
  • వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టిన పోలీసులు
హిందువులు పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రిషికేశ్ లో ఫ్రాన్స్ కు చెందిన ఓ యువతి వివస్త్రగా నిలబడి వీడియో తీసుకుందని ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఇక్కడి గంగా నదిపై నిర్మించిన లక్షణ్ జులా (వంతెన)పై నిలబడిన ఆమె, సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో ఆమె పెట్టగా, అది వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఫ్రాన్స్ కు చెందిన 27 ఏళ్ల మేరీ హెలెనే అనే యువతిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ వీడియో వైరల్ అయి, విమర్శలు వచ్చిన తరువాత ఆమె క్షమాపణలు చెప్పింది. తానేమీ పూర్తిగా వివస్త్రను కాలేదని, లైంగిక అఘాయిత్యాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేశానని తెలిపింది. తాను నెక్లెస్ లను ఆన్ లైన్ లో విక్రయిస్తుంటానని,దానికి ప్రమోషన్ నిమిత్తం ఈ పని చేశానని తమ విచారణలో పేర్కొందని స్థానిక పోలీసు అధికారి పీకే సక్లానీ వెల్లడించారు.

తాను ఈ వంతెనపై నడుస్తున్నప్పుడల్లా, పురుషుల నుంచి వేధింపులను ఎదుర్కొన్నానని, భారత సోదరీమణులు, ఇతర మహిళలు కూడా ఇక్కడ ఇదే విధమైన వేధింపులను ఎదుర్కొంటారన్న ఉద్దేశంతోనే తాను ఈ పని చేశానని మేరీ పేర్కొంది. తాను చేసిన ఈ పని వెనుక ఎంతో ఉద్దేశం ఉందని తన చర్యను సమర్థించుకుంది. కాగా, అరెస్ట్ చేసిన తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై విడిచి పెట్టామని, కేసును విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆమె సెల్ ఫోన్ ను విచారణ నిమిత్తం సీజ్ చేశామని అన్నారు.
Rushikesh
Nude Video
Laxman Juhla

More Telugu News