Janasena: రాజధాని తరలింపు వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేస్తాం... కేసులో తుదివరకు బాధ్యతగా నిలబడతాం: పవన్ కల్యాణ్
- రాజధాని తరలింపుపై హైకోర్టులో వ్యాజ్యాలు
- కౌంటర్ దాఖలుకు అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన హైకోర్టు
- పార్టీ ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్న పవన్
ఏపీ రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు అన్ని పార్టీలకు అవకాశమివ్వాలని హైకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. రాజధాని తరలింపునకు సంబంధించిన వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని పార్టీ అధినాయకత్వం తీర్మానించింది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ విషయంపై చర్చించేందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ ఉదయం నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్, టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, హరిప్రసాద్ వంటి అగ్రనేతలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్న పిమ్మట కౌంటర్ దాఖలుపై నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, పాలన వికేంద్రీకరణ, రాజధాని తరలింపు అంశాల్లో జనసేన తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయంతో ఉందని వెల్లడించారు. ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చేసిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదని జనసేన బలంగా చెబుతోందని స్పష్టం చేశారు. ఇప్పుడు రాజధాని తరలింపుకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, హైకోర్టు దీనికి సంబంధించిన వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని సూచించిన నేపథ్యంలో, న్యాయనిపుణుల సలహా తీసుకుని గడువులోగా కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా, ఈ కేసులో చివరి వరకు బాధ్యతగా నిలబడతామని పవన్ స్పష్టం చేశారు.