Sake Sailajanath: మంత్రి పెద్దిరెడ్డిపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఇంకా పదవిలో ఉంచడమేమిటి?: ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
- జడ్జి రామకృష్ణను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు
- కేసులను పెద్దిరెడ్డి ప్రభావితం చేస్తున్నారు
- రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నాయి
ఏపీ మంత్రి పెడ్డిరెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి ఒత్తిడితోనే జడ్జి రామకృష్ణను ఇంటి నుంచి బయటకు రాకుండా 145 ప్రొసీడింగ్ ఇచ్చారని మండిపడ్డారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే జడ్జి రామకృష్ణకే న్యాయం జరగడం లేదంటే... సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రామకృష్ణ పెట్టిన కేసులను కూడా తన అధికారంతో పెద్దిరెడ్డి ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నో ఆరోపణలు వస్తున్నప్పటికీ పెద్దిరెడ్డిని ఇంకా పదవిలో కొనసాగించడం ఏమిటని ప్రశ్నించారు. కొంతకాలం పాటు ఆయనను అధికారానికి దూరం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దారుణమైన దాడులు జరుగుతున్నాయని... వీటన్నిటి వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వైసీపీ నేతలు, అధికారుల హస్తం ఉందని చెప్పారు. రామకృష్ణ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. వైసీపీ, జనసేన, బీజేపీలకు సంబంధాలు ఉన్నాయని చెప్పారు.