Anagani Sathyaprasad: జగనే బయటికి రావడం లేదు... ఇక విద్యార్థులు ఎలా వస్తారు?: టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
- స్కూళ్లు తెరిచేందుకు సిద్ధమవుతున్న ఏపీ సర్కారు!
- జగనన్న విద్యా కిట్లు ఇంటి వద్దకే అందించాలన్న అనగాని
- విద్యార్థుల్ని కరోనా బాధితుల్ని చేస్తారా? అంటూ ఆగ్రహం
టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఏపీ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు. స్కూళ్ల రీఓపెనింగ్ పైనా, జగనన్న విద్యాకానుక పంపిణీ, తదితర అంశాలపైనా సత్యప్రసాద్ విమర్శలు చేశారు. జగనన్న విద్యా కానుకలు పంపిణీ చేసేందుకు వలంటీర్లను ఉపయోగించుకోవాలని, జగనన్న విద్యా కానుక కిట్లను వలంటీర్ల సాయంతో విద్యార్థుల ఇంటివద్దకే పంపిణీ చేయాలని హితవు పలికారు.
రాష్ట్రంలో స్కూళ్లు తెరవాలన్న ప్రభుత్వ ఆలోచన సరైనది కాదని, కరోనా వ్యాప్తి భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపాలని కోరుకోవడంలేదని అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రే బయటికి రావడంలేదని, పిల్లలు ఎలా బయటికి వస్తారని ప్రశ్నించారు. వైసీపీ సర్కారు మద్యం షాపులు తెరిచి, టీచర్లను కాపలా పెట్టిందని, తత్ఫలితంగా వందలాది మంది టీచర్లు కరోనా బారినపడ్డారని సత్యప్రసాద్ ఆరోపించారు. ఇప్పుడు స్కూళ్లు తెరిచి విద్యార్థులను కూడా కరోనా మహమ్మారికి గురిచేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.