YSR Vedadri Project: ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన జగన్.. కృష్ణా జిల్లాను పట్టించుకోలేదని టీడీపీపై విమర్శలు!
- వైయస్సార్ వేదాద్రి ప్రాజెక్టుకు శంకుస్థాపన
- సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రిమోట్ ద్వారా శంకుస్థాపన
- 2021 ఫిబ్రవరికి ప్రాజెక్టు పూర్తవుతుందన్న సీఎం
వ్యవసాయరంగంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఆయన ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆయన శ్రీకారం చుట్టారు. మరోవైపు, ఈరోజు వైయస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు.
కరోనా నేపథ్యంలో, ఆన్ లైన్ ద్వారానే సీఎం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. రూ. 368 కోట్లతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తైతే... కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న 30 గ్రామాలకు తాగునీరు, 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏనాడూ కృష్ణా జిల్లా సమస్యలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు. 2021 ఫిబ్రవరికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు.