Narendra Modi: నీట్, జేఈఈ పరీక్షలు మరింత ఆలస్యమైతే కష్టం... మోదీకి 150 మంది విద్యావేత్తల లేఖ!

A Letter to Modi from 150 Academicians
  • విద్యార్థుల భవిష్యత్తుపై సర్దుకుపోవద్దు
  • ఇప్పటికే విద్యా సంవత్సరం పరంగా అనిశ్చితి
  • వారి కలలను ఆలస్యం చేయవద్దు
  • మోదీకి లేఖలో అకడమీషియన్లు
కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా నీట్,జేఈఈ పరీక్షలను మరింతకాలం పాటు వాయిదా వేస్తే, విద్యార్థుల భవిష్యత్తు విషయంలో సర్దుకుపోయినట్టు అవుతుందని వివిధ భారత, విదేశీ యూనివర్శిటీలకు చెందిన 150 మంది అకడమీషియన్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

కేంద్రం సెప్టెంబర్ లో ఈ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించగా, కాంగ్రెస్ సహా పలు విపక్షాలు, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పరీక్షల రద్దుకు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాకపోవడం, కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, పరీక్షలు జరిపి, అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.

కాగా, "తమ రాజకీయ అజెండాను అమలు చేసేందుకు కొందరు విద్యార్థులను, కరోనాను అడ్డు పెట్టుకుంటున్నారు. విద్యార్థులు, యువతే దేశ భవిష్యత్తు. కరోనా కారణంగా ఇప్పటికే వారు విద్యపరంగా ఈ సంవత్సరం అనిశ్చితిలో పడిపోయారు. పై తరగతుల్లో అడ్మిషన్లు, క్లాసుల ప్రారంభం వంటి వాటిపై సాధ్యమైనంత త్వరగా దృష్టిని సారించాలి" అని విద్యావేత్తలు పేర్కొన్నారు.

 ప్రతి సంవత్సరంలానే, ఈ సంవత్సరం కూడా లక్షలాది మంది ఇంటర్ పాస్ అయి, తదుపరి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం వేచి చూస్తున్నారని గుర్తు చేసిన వీరు, ఇప్పటికే నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణ ఆలస్యం అయిందని, మరింత ఆలస్యమైతే యువత కలలు చెదిరిపోతాయని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ యూనివర్శిటీ, ఐగ్నోవ్, లక్నో యూనివర్శిటీ, జేఎన్యూ, ఐఐటీ ఢిల్లీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ది హీబ్రూ యోనివర్శిటీ ఆఫ్ జరూసలేం తదితర వర్శిటీల ప్రొఫెసర్లు ఈ లేఖపై సంతకాలు చేయడం గమనార్హం. ఇదిలావుండగా, ఈ సంవత్సరం దాదాపు 14 లక్షల మంది ప్రవేశ పరీక్షలకు హాజరు కావాలని నిర్ణయించుకుని, అడ్మిట్ కార్డులు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే.
Narendra Modi
Academisians
Letter
JEE
NEET

More Telugu News