Insha Jaan: పాక్ ఉగ్రవాదులకు అన్ని విధాలా సహకరించిన 23 ఏళ్ల యువతి... ఎన్ఐఏ చార్జ్ షీట్ లో వివరాలు!
- గత సంవత్సరం దాడిలో ప్రమేయం
- ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇచ్చిన తండ్రీ కూతుళ్లు
- చిత్రాలను విడుదల చేసిన ఎన్ఐఏ
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న యువతిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. గత సంవత్సరం పుల్వామాపై జరిగిన ఉగ్రదాడిలో నిందితులకు ఓ 23 ఏళ్ల యువతి తనవంతు సహకారాన్ని అందించిందని నిన్న దాఖలు చేసిన చార్జ్ షీట్ లో జాతీయ దర్యాఫ్తు సంస్థ పేర్కొంది. ఇన్షా జాన్ అనే యువతి మార్చిలో సెక్యూరిటీ దళాల చేతుల్లే హతుడయిన మహమ్మద్ ఉమర్ ఫారూక్ కు సహకరించిందని ఎన్ఐఏ పేర్కొంది.
ఆమె తరచూ ఉగ్రవాదులతో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేదని, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మాధ్యమంగా టచ్ లో ఉండేదని తెలియజేసింది. వీరిద్దరి మధ్యా సాగిన ఎన్నో మెసేజ్ లను తాము ఆధారాలుగా సంపాదించామని కోర్టులో దాఖలు చేసిన 13,500 పేజీల భారీ చార్జ్ షీట్ లో పేర్కొంది. ఇన్షా జాన్ తండ్రి తారీఖ్ పీర్ కూడా ఉగ్రవాదులతో మాట్లాడుతూ ఉండేవారని ఎన్ఐఏ పేర్కొంది.
పుల్వామా ప్రాంతానికి ఉమర్ ఫారూఖ్, మరో ఇద్దరు దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు వచ్చిన వేళ, తండ్రీ కూతుళ్లు, వారికి ఆతిథ్యం ఇచ్చారని, వారికి ఆహారం, నివాస సదుపాయాలు, ఇతర అవసరాలను తీర్చారని, మొత్తం 15 ప్రాంతాల్లో వీరికి బస ఏర్పాట్లు చేశారని, ప్రతి చోటా ఉగ్రవాదులు రెండు నుంచి నాలుగు రోజులు ఉన్నారని తమ దర్యాఫ్తులో తేలిందని ఎన్ఐఏ పేర్కొంది.
2018 నుంచి 2019 మధ్య తండ్రీ కూతుళ్లు ఉగ్రవాదులకు తమవంతు సహకారాన్ని అందించారని చెబుతూ వారి చిత్రాలను కూడా విడుదల చేసింది. ఈ చిత్రాల్లో ఇన్షా పక్కన అత్యాధునిక మారణాయుధాలు కనిపిస్తూ ఉండటం గమనార్హం.