Corona Virus: కరోనాకు పురుషులే ఎందుకు టార్గెట్ అవుతున్నారు?.. గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు
- పురుషులతో పోలిస్తే మహిళల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ
- ప్రమాదకారక కణాలను నాశనం చేసే టి-కణాల విడుదల వారిలోనే అధికం
- యేల్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
కరోనా మహమ్మారి బారినపడి అస్వస్థతకు గురవుతున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉండడంపై దృష్టిసారించిన శాస్త్రవేత్తలు అలా ఎందుకు జరుగుతోందన్న గుట్టు విప్పారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో రోగనిరోధక వ్యవస్థ మరింత మెరుగ్గా ఉండడమే ఇందుకు కారణమని తేల్చారు.
అమెరికాలోని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. 18 ఏళ్లకు పైబడిన 98 మంది కొవిడ్ బాధితులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసినట్టు పరిశోధకులు తెలిపారు. కరోనా సోకిన తర్వాత శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకారక కణాలను నాశనం చేయడంలో రోగ నిరోధక వ్యవస్థలోని టి-కణాలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వైరస్ సోకిన తర్వాత పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ కణాలు అధికంగా విడుదలవుతున్నట్టు అధ్యయనంలో తేలినట్టు వివరించారు.