Nagaraju: కీసర లంచం కేసు: ఆ కోటీ ఎవరివి? ఎక్కడివి?... లెక్క తేలుస్తుంటే వెల్లడవుతున్న పెద్దల పేర్లు!
- కీలక సమాచారాన్ని రాబడుతున్న అధికారులు
- ఇంత భారీ మొత్తం ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నది ఎవరు?
- కేసును సీరియస్ గా తీసుకున్న ఏసీబీ
కీసర తహసీల్దారు తీసుకున్న కోటి రూపాయలకు పైగా లంచం, ఇప్పుడు ఏసీబీ అధికారుల ముందు ఎన్నో ప్రశ్నలను ఉంచింది. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి లంచంగా ఇచ్చేందుకు ఎవరు సమకూర్చారు? ఈ డీల్ వెనుక ఎవరున్నారు? అసలు ఆ స్థలం యజమానులు ఎవరు? వారే యజమానులైతే, పట్టా పొందేందుకు అంత లంచం ఇచ్చేందుకు ఎందుకు ముందుకు వచ్చి, ఎమ్మార్వోతో డీల్ కుదుర్చుకున్నారు?, ఆ డబ్బును ఎవరు అందించారు?... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను తవ్వి తీస్తుంటే, పలువురు పెద్దల పేర్లు వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తోంది.
ఈ కేసులో ఉన్న తహసీల్దారు నాగరాజు, వీఆర్వో సాయిరాజ్, వీరితో పాటు నిందితులుగా ఉన్న శ్రీనాథ్, అంజిరెడ్డిలను రెండో రోజు విచారించిన ఏసీబీ అధికారులు, కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో అంజిరెడ్డి ఇంటిలో లభించిన భూముల తాలూకు డాక్యుమెంట్లపైనా అధికారులు విచారించినట్టు సమాచారం. లంచంగా ఇచ్చిన రూ.1.10 కోట్ల నెట్ క్యాష్ ఎవరిదన్న ప్రశ్నకు ఫిర్యాదిదారుల నుంచి కూడా సమాధానం రాకపోవడంతో అధికారులు కేసును సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది.
ఈ కేసులో తహసీల్దారు నాగరాజు మాత్రం ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పారని ఓ అధికారి వెల్లడించారు. తన బ్యాంకు లాకర్లపై మాత్రం ఆయన సమాచారాన్ని దాస్తున్నారని తెలుస్తోంది. కోర్టు అనుమతించిన ప్రకారం, విచారణ అనంతరం నిందితులను తిరిగి చంచల్ గూడ జైలుకు తీసుకెళ్లిన అధికారులు, వారిని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని అంటున్నారు.