CM Jagan: గుండు కొట్టించడం వంటి ఘటనలు తప్పు... అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దు: సీఎం జగన్
- రాష్ట్రంలో దళితులపై దాడుల పట్ల సీఎం స్పందన
- తప్పు చేస్తే ఎవర్నైనా శిక్షిస్తామని స్పష్టీకరణ
- గత ప్రభుత్వం దళితులపై దాడులను పట్టించుకోలేదని ఆరోపణ
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరుతెన్నులు, దళితులపై పెరుగుతున్న దాడులు తదితర అంశాలపై ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కఠిన వ్యాఖ్యలు చేశారు. సీతానగరం శిరోముండనం ఘటన నేపథ్యంలో మాట్లాడుతూ, గుండు కొట్టించడం వంటి ఘటనలు తప్పు అని, అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి ఎంతో తేడా ఉందని, దళితులపై దాడి జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదని, ఇప్పుడు పొరపాటు చేస్తే పోలీసులను కూడా జైల్లో పెడుతున్నామని అన్నారు. ఎస్ఐని జైల్లో పెట్టిన ఘటన గతంలో ఎప్పుడూ లేదని తెలిపారు. ఎస్సై అయినా, సీఐ అయినా సరే తప్పు చేస్తే కఠినచర్యలు తప్పవని సీఎం జగన్ హెచ్చరించారు.
తమకు ఎవరైనా ఒక్కటేనని, నిష్పాక్షితకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో హోంమంత్రి దళిత వర్గానికి చెందిన మహిళ అని, డీజీపీ ఎస్టీ అని వెల్లడించారు. సమాజంలో దిగువ వర్గాల వారికి రక్షణగా ఉండాల్సింది పోలీసులేనని, ఈ సందేశాన్ని ఎస్పీలు, ఏఎస్పీలు దిగువస్థాయి వరకు తీసుకెళ్లాలని ఉద్బోధించారు.