Gangooly: ఆ పని చేయకుంటే సచిన్ ఇంత గొప్ప ఆటగాడు అయ్యేవాడే కాదు: గంగూలీ

Gangooly Comments on Sachin and Dhoni in An Interview

  • ఓపెనర్ గా ఆడకుంటే ఇన్ని రికార్డులు రావు
  • ధోనీలో సత్తాను గమనించే వన్ డౌన్ లో పంపాను
  • 'స్పోర్ట్స్ ట్రాక్'తో ఇంటర్వ్యూలో గంగూలీ

కోట్లాది క్రికెట్ అభిమానుల ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్, ఓపెనర్ గా బ్యాటింగ్ చేయకుంటే, ఇంత పేరు ప్రతిష్ఠలు దక్కేవి కావని మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ టీవీ షోలో మాట్లాడిన ఆయన, ఎంఎస్ ధోనీ గురించి ప్రస్తావిస్తూ, సచిన్ ను ఉదాహరణగా చూపారు. ధోనీని టాప్ ఆర్డర్ కు ప్రమోట్ చేయడాన్ని గుర్తు చేసుకున్న గంగూలీ, ధోనీని పూర్తిగా గమనించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

కాగా, ధోనీ క్రికెట్ లోకి ప్రవేశించిన వేళ, గంగూలీ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో ఆడిన కొన్ని మ్యాచ్ లలోనే అతని సత్తాను గమనించి, విశాఖపట్నంలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 3వ నంబర్ ఆటగాడిగా ప్రమోట్ చేశానని, ఆ మ్యాచ్ లో 148 పరుగులు చేసిన ధోనీ, ఆపై ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదని అన్నారు. అదే సమయంలో సచిన్ 6వ నంబర్ ఆటగాడిగా ఆడివుంటే, ఇన్ని రికార్డులు లభించి వుండేవి కాదని, తొలి ఐదేళ్లూ మిడిల్ ఆర్డర్ లో ఆడిన వేళ, భారీగా పరుగులను సాధించలేదని గంగూలీ గుర్తు చేశారు. 1994లో న్యూజిలాండ్ టూర్ లో ఓపెనర్ గా ప్రమోట్ అయిన తరువాతనే సచిన్ సత్తా ప్రపంచానికి తెలిసిందని అన్నారు.

'స్పోర్ట్స్ ట్రాక్'తో మాట్లాడిన గంగూలీ, "వైజాగ్ మ్యాచ్ లో ధోనీ 3వ నంబర్ ఆటగాడిగా రాకుంటే, తనలోని ఆటగాడిని ప్రపంచానికి చూపేందుకు అతనికి మరింత సమయం పట్టి వుండేది. ఇదే విధంగా సచిన్ 6వ నంబర్ ఆటగాడిగానే కొనసాగివుంటే, సచిన్... ఇంత గొప్ప ఆటగాడు అయ్యుండేవాడు కాదు. భారీ స్కోర్లు సాధించడానికి అవసరమైనన్ని బాల్స్ ఆ స్థానంలో ఆటగాడికి లభించవు" అన్నారు. ఆ సమయంలో క్వాలిటీ ఆటగాళ్లను ఎన్నుకుని, వారిని ప్రమోట్ చేసి విజయం సాధించడంపైనే దృష్టిని సారించే వాడినని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News