Srisailam: శ్రీశైలంలో ప్రమాదం జరిగిన వెంటనే ఆటోమేటిగ్గా ట్రిప్ అవ్వాలి... కానీ అలా జరగలేదు: జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు
- శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం
- 9 మంది మృతి
- కమిటీ వేశామన్న తెలంగాణ జెన్ కో సీఎండీ
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై తెలంగాణ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. జల్ విద్యుత్ కేంద్రంలో ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగిన వెంటనే ఆ యూనిట్ లో ఆటోమేటిగ్గా ట్రిప్ అవ్వాలని, కానీ అలా జరగలేదని అన్నారు. ఎందుకు ట్రిప్ అవలేదన్న విషయమై ఓ కమిటీ వేశామని వెల్లడించారు. సకాలంలో ట్రిప్ కాకపోవడంతో మిగతా యూనిట్లలో వైబ్రేషన్లు వచ్చాయని వివరించారు.
తమ ఇంజినీర్లు చివరి నిమిషం వరకు ప్రయత్నించి నీళ్లు యూనిట్ లోకి రాకుండా చూశారని, ఒకవేళ నీళ్లు యూనిట్ లోకి వచ్చి ఉంటే మొత్తం మునిగిపోయేదని తెలిపారు. ఇంజినీర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ప్లాంటును కాపాడుకున్నారని ప్రభాకర్ రావు విచారవదనంతో చెప్పారు. ఇంజినీర్లు ప్రాణాలతో బయటికొస్తారన్న నమ్మకం చివరివరకు ఉందని, ఒకవేళ వారు అపస్మారక స్థితిలో ఉంటే వారి కోసం అంబులెన్సులు కూడా సిద్ధం చేశామని, తాము సైతం లోనికి వెళ్లేందుకు మూడు సార్లు ప్రయత్నించి విఫలం అయ్యామని ఆయన బాధను వ్యక్తం చేశారు.
తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రమాదంలో 9 మంది చనిపోవడం విషాదకరం అని పేర్కొన్నారు. ప్రమాదం సమయంలో ప్లాంట్ లో పవర్ సప్లై నిలిచిపోవడంతో వెంటిలేషన్ ఆగిపోయిందని, దానికితోడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా తెరుచుకోలేదని వెల్లడించారు.