shashi tharoor: దేశ ఐకమత్యాన్ని నాశనం చేయాలని తుక్‌డే తుక్‌డే గ్యాంగ్ నిశ్చయించుకున్నట్టుంది: శశిథరూర్
- ఆయుష్ కార్యదర్శి రాజేశ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన థరూర్
- కేంద్రంలో ఇప్పుడున్నది ‘తుక్‌డే తుక్‌డే గ్యాంగ్’ అంటూ విమర్శలు
- రాజేశ్ స్థానంలో తమిళ అధికారిని నియమించాలని డిమాండ్
దేశ ఐకమత్యాన్ని నాశనం చేసేందుకు ‘తుక్‌డే తుక్‌డే గ్యాంగ్’ కంకణం కట్టుకున్నట్టు ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. కేంద్ర ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కొటెచ్చా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై థరూర్ ఇలా స్పందించారు.
కేంద్రంలో ఇప్పుడున్నది ‘తుక్‌డే తుక్‌డే గ్యాంగ్’ అని తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యర్థులను ఇబ్బందుల పాలు చేయడాన్ని కేంద్రం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. శిక్షణ కార్యక్రమం సందర్భంగా రాజేశ్ చేసిన వ్యాఖ్యలు అసాధారణమైనవని అన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం మర్యాద ఉన్నా రాజేశ్ స్థానంలో తమిళ అధికారిని నియమించాలని శశిథరూర్ డిమాండ్ చేశారు.
కాగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ శిక్షణ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి రాజేశ్ కొటెచ్చా మాట్లాడుతూ.. హిందీ మాట్లాడడం రాని, అర్థం చేసుకోలేని యోగా టీచర్లు, మెడికల్ ప్రాక్టీస్‌నర్లు బయటకు వెళ్లిపోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో వివాదాస్పదమైంది. రాజేశ్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.