Woman: మహిళ అండాశయం నుంచి 50 కిలోల కణితిని తొలగించిన ఢిల్లీ వైద్యులు

Doctors removed fifty kilos tumor in Delhi

  • కొంతకాలంగా వేగంగా బరువు పెరిగిన మహిళ
  • కొన్నినెలల్లోనే 106 కిలోల బరువుకు చేరిన ఢిల్లీ వాసి
  • కణితి ఉన్నట్టు గుర్తించిన అపోలో వైద్యులు
  • ప్రపంచంలో ఇదే అతిపెద్ద కణితి అని వెల్లడి

కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో మనిషి దేహంలో కణితులు (ట్యూమర్లు) ఏర్పడుతుంటాయి. అవి 10 కిలోల బరువుంటేనే వామ్మో అనుకుంటాం. అలాంటిది 50 కిలోల కణితి అంటే ఎలావుంటుందో ఆలోచించుకోవచ్చు. ఓ మహిళ అండాశయం నుంచి ఢిల్లీ వైద్యులు అర "క్వింటా" బరువున్న అతి భారీ ట్యూమర్ ను తొలగించారు. ఆమె శరీర బరువులో సగం బరువున్న ఆ కణితిని చూసి వైద్యులే దిగ్భ్రాంతికి గురయ్యారు. పాత ఢిల్లీకి చెందిన 52 ఏళ్ల మహిళ ఇటీవల వేగంగా బరువు పెరగసాగింది. కొన్నినెలల్లోనే ఆమె బరువు 106 కిలోలకు చేరింది.

ఇటీవల ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొత్తికడుపులో నొప్పి వంటి సమస్యలు వస్తుండడంతో స్థానికంగా ఓ సర్జన్ ను సంప్రదించగా, ఆయన అపోలో ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆ డాక్టర్ చెప్పినట్టుగానే ఆమె ఇంద్రప్రస్థలో ఉన్న అపోలో హాస్పిటల్ కు వెళ్లింది. ఆమె తీవ్రస్థాయిలో రక్తహీనతతో బాధపడుతున్నట్టు తెలుసుకున్న అపోలో ఆసుపత్రి వైద్యులు ఆమెకు పలు వైద్యపరీక్షలు చేసి అండాశయంలో కణితి ఉందని గుర్తించారు. దాంతో నిపుణులైన సర్జన్ల బృందం దాదాపు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి 50 కిలోల బరువున్న కణితిని బయటికి తీశారు.

అపోలోకి చెందిన డాక్టర్ అరుణ్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఇంత బరువున్న కణితిని శస్త్రచికిత్స చేసి తొలగించిన దాఖలాలు మునుపెన్నడూ లేవని వెల్లడించారు. 2017లో కోయంబత్తూరులో ఓ మహిళకు 34 కిలోల బరువున్న కణితిని తొలగించారని వివరించారు.

  • Loading...

More Telugu News