Kerala: తిరువనంతపురం ఎయిర్ పోర్టును అదానీకి ఇవ్వడంపై తీవ్ర రగడ... ఎందుకిచ్చారో చెప్పిన విమానయాన మంత్రి!

Center Told Reason why they givee Kerala Airport to Adani

  • అదానీ గ్రూప్ కు విమానాశ్రయం నిర్వహణ
  • బిడ్ విధానాన్ని పారదర్శకంగా నిర్వహించాం
  • కేరళ ప్రభుత్వ సంస్థ తక్కువ బిడ్ వేసిందన్న కేంద్రం

ఇటీవల జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయం నిర్వహణను ఏభై సంవత్సరాల పాటు అదానీ గ్రూప్ కు ఇస్తూ, క్యాబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో, కేరళ సర్కారు తీవ్రంగా స్పందించింది. విమానాశ్రయంలో అత్యధిక వాటా ఉన్న తామే నిర్వహిస్తామని చెబుతుంటే, కేంద్రం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం సహేతుకం కాదని సీఎం పినరయి విజయన్, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఘాటైన లేఖ రాశారు.

దీనిపై స్పందించిన పౌర విమానయాన మంత్రి హర్ దీప్ సింగ్ పూరి, విమానాశ్రయాల ప్రైవేటీకరణపై ఉన్న నిబంధనలను వివరించారు. నిబంధనల ప్రకారం, విమానాశ్రయంలో అత్యధిక వాటా ఉన్న కేఎస్ఐడీసీ (కేరళ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) బిడ్డింగ్ లో అత్యధికంగా కోట్ చేసిన కంపెనీకి 10 శాతం తక్కువలో కోట్ చేసినా విజేతగా నిలిచేదని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, 10 శాతం రేంజ్ లో కేరళ సంస్థ బిడ్ లేదని స్పష్టం చేశారు.

"ఒక్కో ప్యాసింజర్ కు రూ. 168 ఇచ్చేందుకు ఎంపికైన బిడ్ పేర్కొంది. ఇదే అత్యధికం. ఒప్పందం ప్రకారం, దీనికన్నా 10 శాతం తక్కువ రేంజ్ లో కేఎస్ఐడీసీ బిడ్ వేసుంటే విజేతగా నిలిచేది. కానీ, ఆ సంస్థ ప్యాసింజర్ కు రూ. 135 మాత్రమే చెల్లిస్తామని బిడ్ వేసింది. ఇది 19.64 శాతం తక్కువ. అందుకే ఆ సంస్థకు ఎయిర్ పోర్టు దక్కలేదు. బిడ్డింగ్ విధానమంతా పూర్తి పారదర్శకంగా జరిగింది" అని హర్ దీప్ సింగ్ పూరి తెలిపారు.

కాగా, తమ అధీనంలో ఉన్న ఎయిర్ పోర్టును ప్రైవేటు పరం చేయడంపై 'రైట్ ఆఫ్ రిఫ్యూజల్' హక్కున్న కేరళ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించింది. తమ ప్రభుత్వం ఎన్నిసార్లు కేంద్రానికి విన్నవించినా, తమ విజ్ఞాపనలను మోదీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని పినరయి సర్కారు తీవ్ర ఆరోపణలు చేసింది. తమ రాష్ట్ర ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని కేరళ విపక్ష నేత రమేశ్ చెన్నితాల సైతం వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News